బ్రేకింగ్: జేసీ తండ్రీకొడుకుల అరెస్ట్

Update: 2020-06-13 04:15 GMT
అనంతపురం రెడ్డప్పలు అరెస్ట్ అయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.

తాజాగా జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన 154 వాహనాలకు సంబంధించి ఫేక్ ఇన్సూరెన్స్ వ్యవహారంలో అనంతపురం పోలీసులు ఈ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. రవాణా శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ లో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని అనంతపురంకు తరలిస్తున్నారు.

ఇటీవలే జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన బీఎస్3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్టు వీరిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూపీలాగిన అధికారులు నకిలీ పత్రాలతో 154 వాహనాలను నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్టు విచారణలో తేలింది.  ఇన్సూరెన్స్ చెల్లించకుండానే నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో జేసీ అస్మిత్ రెడ్డి, 154 బస్సుల నకిలీ ఎన్ఓసీ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిలను తాజాగా అరెస్ట్ చేశారు.

నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అనంతపురం, తాడిపత్రి పోలీస్ స్టేషన్లలో జేసీ ట్రావెల్స్ పై 27 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే వారి 60 బస్సులు కూడా సీజ్ చేశారు. 94 బస్సుల ఆచూకీ తెలియడం లేదు.  ఇప్పటికే స్క్రాప్ కింద కొనుగోలు చేసిన బస్సులను రవాణాకు ఉపయోగించినందుకు జేసీ ట్రావెల్స్ కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు అందించారు. ఇప్పుడు అరెస్ట్ లు చేశామని పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News