ఎంపీలుగా జేపీ.. జేడీ...ఆ పార్టీ మాస్టర్ ప్లానేనా....?

Update: 2022-10-27 16:30 GMT
బ్యూరోక్రాట్లు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు, ఈ దేశాన  గతంలో కూడా చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. తమ సత్తా చాటారు. ఎనిమిదేళ్ళుగా ఢిల్లీ స్టేట్ ని ఏలుతున్న అరవింద్ కేజ్రీవాల్ ఐయారెస్ ఆఫీసర్ గా చాలా కాలం పనిచేశారు. ఇక దేశంలో చాలా రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి ఉన్నతాధికారులు ప్రవేశించి సక్సెస్ అయిన చరిత్ర ఉంది. తెలుగు నాట చూస్తే 2009 ఎన్నికలలో లోక్ సత్తా పార్టీ తరఫున జయప్రకాష్ నారాయణ్ రాజకీయ అరంగేట్రం చేసి కూకట్ పల్లి అసెంబ్లీ సీటుకు పోటీ చేసి గెలిచారు.

ఆ తరువాత 2014 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తే మాత్రం ఓడారు. ఆ తరువాత ఆయన రాజకీయాల గురించి పూర్తిగా మాట్లాడడం తగ్గించేశారు. కానీ చిత్రంగా ఈ మధ్య వినిపిస్తున్న వార్త ఏంటి అంటే ఆయన మళ్లీ ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడతారు అని. అది కూడా ఏపీ నుంచి అని. ఇది నిజంగా సంచలనమే అనుకోవాలి. జేపీ ఏపీకి చెందిన వారే. అయితే ఆయన తెలంగాణాను కార్యక్షేత్రంగా  ఎంచుకుని పోటీ చేశారు. అక్కడే తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఈసారి మాత్రం ఆయన ఏపీ అంటున్నారు. ఏపీలో ఆయన విజయవాడ నుంచి కానీ లేక ఒంగోలు నుంచి కానీ పోటీ చేస్తారు అని చెబుతున్నారు. విజయవాడలో అయితే ఆయన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు ఎక్కువ మంది అభ్యర్ధులు వారే లోక్ సభ నుంచి గెలిచిన వారు ఉన్నారు. దాంతో పాటు రాజకీయ రాజధానిగా పేరుపొందిన విజయవాడ నుంచి పోటీ చేస్తే ఆ గ్లామర్ వేరేగా ఉంటుంది. పార్టీలతో సంబంధం లేకుండా జేపీకి ప్రజలలో మంచి పేరు ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు, మేధావులు, విద్యావంతులు ఆయనకు మద్దతుగా ఉంటారని అంచనాలు ఉన్నాయి.

దాంతో జేపీ చైతన్యానికి మారు పేరు అయిన విజయవాడ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఒకవేళ అది కాకపోతే తాను పుట్టిన ఒంగోలు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని తెలుస్తోంది. ఈ రెండు చోట్లలో ఒకదాన్ని ఆయన ఎన్నుకుంటారని అంటున్నారు. అయితే ఆయన లోక్ సత్తా నుంచి పోటీ చేస్తారు, కానీ ఆయనకు మద్దతు ఇచ్చ్నేందుకు తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంది అంటున్నారు. పొత్తు పెట్టుకుని లోక్ సత్తాకు జేపీ కోరుకున్న సీటు ఇస్తారని అంటున్నారు. పొత్తు లేకపోయినా ఆయనకు ఇండైరెక్ట్ గా సహకారం ఇస్తారని కూడా చెబుతున్నారు.

మరో వైపు చూస్తే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ఈ మధ్యనే మీడియాకు తెలిపారు. ఆయన 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేశారు. ఆ తరువాత ఆయన ఆ పార్టీని వీడారు. ఇదిలా ఉంటే జేడీ విశాఖ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఆయన వెనక తెలుగుదేశం ఉంటుంది అన్న ప్రచారం సాగుతోంది. జేడీ ఇండిపెండెంట్ గా పోటీ అని అంటున్నా ఎన్నికల ముందు ఆయన టీడీపీ జెండా కప్పుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు.

మొత్తానికి ఈ ఇద్దరు మేధావులను, బ్యూరోక్రాట్లను తన వైపు తిప్పుకుని వారికి అండగా ఉంటూ పార్లమెంట్ లో వీరి వాణిని వినిపించేలా చేయాలని తెలుగుదేశం ఆలోచిన్స్తోంది. అంతే కాకుండా వారి మద్దతు తీసుకుని మేధావులు, తటస్థులు,  మధ్యతరగతి వర్గాల ఓటు బ్యాంక్ ని కొల్లోగొట్టాలని టీడీపీ పక్కా స్కెచ్ వేసింది అని అంటున్నారు.

అందులో భాగమే వీరికి మద్దతు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.మొత్తానికి ఈ మధ్య చూస్తే ఈ ఇద్దరు నేతలూ అమరావతికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలగే ఏపీ విభజన హామీల మీద మాట్లాడుతున్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, అందుకే మేధావులు ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని టీడీపీ చెబుతూ వీరికి అండగా ఉంటుందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News