రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేకి రూ.50 లక్షల చొప్పున ఇచ్చారు.. జేడీఎస్ ఎమ్మెల్యే సంచలనం

Update: 2022-06-12 09:00 GMT
కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించిన ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ఓటేసిన జేడీఎస్ కోలారు ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ నేరుగా మీడియాతో చెప్పడం విశేషం. రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయడానికి తమ సొంత పార్టీ జేడీఎస్ ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కూడా ఇవ్వజూపారని అయితే తాను తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యేలను లంచం ఇచ్చి కొనుగోలు చేసిన పార్టీ నాయకులు తన గురించి ఆరోపణలు చేయడంలో అర్థం లేదని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఓటేశానని శ్రీనివాస గౌడ చెప్పారు. తనకు కాంగ్రెస్ అంటే ఇష్టమని, త్వరలో ఆ పార్టీలో చేరుతున్నానన్నారు.

మరోవైపు జేడీఎస్ అధినేత, మాజీ సీఎం, కుమారస్వామి మాత్రం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుని బీజేపీకి సహకరించిందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 32 మందిలో ఇద్దరు కాంగ్రెస్‌కు ఓటేశారని తెలిపారు. మాలాంటి సెక్యులర్‌ పార్టీకి మద్దతు ఇవ్వకుండా బీజేపీని కాంగ్రెస్ బలపరిచింది అని విమర్శలు చేశారు.

కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 10న జరిగిన పోలింగ్ లో జేడీఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థికి వీళ్లు ఓటేశారు. వీరిలో శ్రీనివాస గౌడ ఒకరు కాగా మరొకరు ఎవరో తెలియాల్సి ఉంది.

కాగా, పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జేడీఎస్ ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖ రాశారు. ఆత్మప్రబోధానుసారం తమ పార్టీ అభ్యర్థి మన్సూర్ అలీఖాన్‌కు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఆయన గెలిస్తే లౌకికవాదం విజయం సాధించినట్టేనని అన్నారు.

కర్ణాటకలో నాలుగు సీట్లకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. అధికార బీజేపీ తన బలంతో ఇద్దర్ని, కాంగ్రెస్ ఒక్కర్ని గెలిపించుకోగలవు. కానీ కమలం పార్టీ ముగ్గుర్ని, కాంగ్రెస్ ఇద్దర్ని నిలబెట్టింది. కాంగ్రెస్ తరఫున మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ గెలుపొందగా, మిగిలిన మూడు స్థానాలు బీజేపీ వశం చేసుకుంది.                
Tags:    

Similar News