ఈ రోజుతో 'జెట్' జ‌ర్నీఆగిపోనుంది

Update: 2019-04-18 06:47 GMT
ఓడ‌లు బండ్లు కావ‌టం ఎలా ఉంటుందో జెట్ కు ఇప్పుడు అనుభ‌వంలోకి వ‌చ్చింది. గ‌డిచిన కొంత‌కాలంగా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న జెట్.. రుణ‌విముక్తి కోసం ఊహించని రీతిలో షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. రుణ బాధ‌లు ఒక‌వైపు.. నిధుల కొర‌త మ‌రోవైపు.. మొత్తంగా క‌లిసి ఈ రోజు (మంగ‌ళ‌వారం) రాత్రి నుంచి త‌న సేవ‌ల్ని నిలిపివేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

అప్పుల ఇబ్బందులు ఎన్ని ఎదురైనా.. ఇంత‌కాలం ఆప‌రేష‌న్స్ కు కిందా మీదా ప‌డి విమానాల్ని న‌డుపుతున్న సంస్థ‌.. తాజాగా సంస్థ‌కు అవ‌స‌ర‌మైన ఆర్థిక ద‌న్ను లేక‌పోవ‌టంతో విమానాల్ని నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికిప్పుడు జెట్ విమానాలు న‌డ‌వాలంటే క‌నీసం రూ.400 కోట్ల వ‌ర‌కు ఆర్థిక నిధులు అవ‌స‌ర‌ముంది. ఆ మొత్తంలో నిధులు స‌ర్ద‌టానికి అటు రుణ‌దాత‌లు కానీ.. ఇటు బ్యాంకులు కానీ ముందుకు రాక‌పోవ‌టంతో.. జెట్ త‌న స‌ర్వీసుల్ని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించింది.

అధికారికంగా జెట్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ఈ రోజు రాత్రి 10.30 గంట‌ల‌కు త‌న చివ‌రి విమానాన్ని న‌డ‌ప‌నుంది.  ఒక‌ప్పుడు అద్భుత‌మైన స‌ర్వీసుల‌తో ఒక వెలుగు వెలిగిన జెట్.. ఇలాంటి రోజు ఒక‌టి వ‌స్తుంద‌ని జెట్ క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌దు. ఒక‌ప్పుడు 123 విమాన‌ల‌తో విజ‌య‌వంతంగా సేవ‌ల్ని అందించిన జెట్.. ఈ రోజున కేవ‌లం ఐదు విమానాల‌తోనే స‌ర్వీసుల్ని నిర్వ‌హించే ప‌రిస్థితినెల‌కొంది.

డ‌బ్బులు చెల్లిస్తే త‌ప్పించి.. విమాన ఇంధ‌నాన్ని ఇస్తామ‌ని ఇంధ‌న సంస్థ‌లు స్ప‌ష్టం చేయ‌టం.. మ‌రోవైపు ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌టంలో ఫెయిల్ కావ‌టం.. లాంటి కార‌ణాల‌తో త‌న స‌ర్వీసుల్ని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించింది. ఆర్థిక సమస్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి.. రుణ‌దాత‌ల సాయం కోసం చివ‌రి క్ష‌ణం వ‌రకూ ప్ర‌య‌త్నించినా సానుకూల ఫ‌లితం రాక‌పోవ‌టంతో త‌న స‌ర్వీసుల్ని నిలిపివేస్తూ సంస్థ నిర్ణ‌యం తీసుకుంది.
Tags:    

Similar News