‘రివ్యూ’ల సీఎం అని జోకులేసుకుంటున్నారు

Update: 2016-09-28 14:33 GMT
చాలామంది రాజకీయ నాయకులు మీడియాను ఎంత ప్రేమిస్తారో.. అంతగా ద్వేషిస్తారు. నిత్యం తమను వీలైనంత బాగా ప్రొజెక్ట్ చేయాలని భావిస్తారే కానీ.. తమ తప్పుల్ని ఎత్తి చూపించాలని కోరుకోరు. కొందరైతే.. ఆ తప్పులేందో ముందే మాకు చెప్పేస్తే సరిపోతుందిగా.. దానికి రాయాల్సిన అవసరం ఏంది? అనే తెలివైనోళ్లు లేకపోలేదు. అలా అని.. అన్ని విషయాలు ఎవరికి వారి చెవుల్లో చెప్పటం వల్ల ప్రయోజనం ఎంత? ప్రజల పక్షాన ఉండే మీడియా.. రాజకీయ నాయకులకు ఫీడ్ బ్యాక్ సెంటర్లుగా ఉండలేవు కదా. చేస్తున్న తప్పుల్ని ప్రజాకోర్టులో పెట్టటం ద్వారా.. తప్పులు చేసే అవకాశం లేకుండా జాగ్రత్తగా పడతారని అనుకుంటాం. కానీ.. ఇప్పటి నేతలే కాదు.. అధినేతలు సైతం తప్పుల మీద తప్పులు చేయటం ఎక్కువైంది.

ఇలాంటి విషయాల్లో ఎక్కువగా కనిపించేది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులోనే. ఆయన చుట్టూ ఉండే అనుచర వర్గం ఆయనకు వాస్తవాల్ని వివరించే ధైర్యం చేయకపోవటం.. అదే సమయంలో అప్ డేట్ అవ్వాల్సినంతగా బాబు కాకపోవటంతో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏపీ ముఖ్యమంత్రి పేరు చెప్పిన వెంటనే.. ఆయన నిత్యం ఏదో ఒక సమీక్ష నిర్వహించటమో.. అధికారులతో సమావేశాలు చేపట్టటమో చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి మీటింగ్ ల మీద మీటింగ్ లు ఉండకుండా.. సామాన్యులకు ఉండవు కదా. అయితే.. దానికి ఒక హద్దు ఉంటుందన్న విషయాన్ని బాబు మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

సోమవారం వస్తే చాలు.. వ్యవసాయ అధికారులతో భేటీతో పాటు.. తాజాగా ఈ మధ్యనే అదనంగా చేరిన పోలవరం రివ్యూ ఉండనే ఉంది. ఈ రెండూ అయ్యేసరికి పుణ్యకాలం ఎంత పూర్తి కావాలో అంత పూర్తి అవుతుంది. వారం మొదటి రోజున.. గంటల కొద్దీ సమయం మీటింగ్ మీదే వెచ్చిస్తే.. ఫీల్డ్ లోకి వెళ్లి పని చేయాల్సిన అధికారులు.. వారికి దిశానిర్దేశం చేసే ఉన్నతాధికారులు ఏం చేయాలి? ఒకవేళ ఏదైనా రివ్యూలు పెట్టినా.. దానికి ఎంత సమయం కేటాయించాలో అంత సమయం కేటాయిస్తారా? అంటే అదీ కనిపించదు. గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు.

ఇక.. రివ్యూ మీటింగ్ టైం ఏమైనా పద్ధతిగా ఉంటుందా? అంటే.. అదీ ఉండదు. పొద్దుపొద్దున్నే రివ్యూ మీటింగ్ పెట్టేస్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి చంద్రబాబుకు సరిపోతుంది. అత్యున్నత అధికారులకూ ఓకే అనుకోవచ్చు. కానీ.. మిగిలిన వారికి పెళ్లాం.. పిల్లలు.. సంసారం.. వ్యక్తిగత అంశాలు ఉంటాయన్న విషయాన్ని బాబు మర్చిపోతారనిపిస్తుంది. ఒకవేళ.. రివ్యూ చేపట్టినా.. అందులో చర్చించే అంశాలు టార్గెట్ చేసేలా ఉంటాయా? అంటే అదీ ఉండదన్న ఆరోపణలు ఉండనే ఉంది.ఇలా ఒక లక్ష్యం లేకుండా.. సాగే ప్రవాహం లాంటి రివ్యూలతో అధికార గణం వణికిపోతోంది. దీని వల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉందన్న విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బాబు ఆ విషయాన్ని గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News