మ‌క్కా తీర్పులో ట్విస్ట్‌..జ‌డ్జీ రిజైన్‌..బుజ్జ‌గింపులు

Update: 2018-04-16 16:36 GMT
మక్కా మసీదు పేలుడు కేసులో అయిదుగురు నిందితులను నాంపల్లికి చెందిన ఎన్ఐఏ ప్ర‌త్యేక‌ కోర్టు నిర్దోషులగా ప్రకటించిన తీర్పు మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టికే ఈ తీర్పు ఆయా పార్టీలు త‌మ‌దైన శైలిలో దీనిపై రాజ‌కీయ కోణంలో స్పందిస్తుండ‌గా కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు. త‌న హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కు రాజీనామా లేఖను పంపారు. కేసు విచారణ సమయంలో ఒత్తిళ్ల వల్లే ఆయన రాజీనామా చేసినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసీమానంద, దేవేందర్ గుప్తా, రాజేందర్ చౌదరి, లోకేశ్ శర్మ, భరత్ భాయిని భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలు నుంచి ఇవాళ ఉదయం నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చి హాజరుపరిచారు. అనంతరం వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. స్వామి అసీమానంద, దేవేందర్ గుప్తా, రాజేందర్ చౌదరి, లోకేశ్ శర్మ, భరత్ భాయి ని కోర్టు నిర్దోషులుగా ప్రకటించారు. అయితే ఈ తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌పై న్యాయ‌వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. రెండేళ్ల క్రితం ఏపీకి చెందిన వారిని తెలంగాణ జడ్జిలుగా నియమించొద్దంటూ తెలంగాణకు చెందిన 11 మంది న్యాయమూర్తులు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో సస్పెండ్‌ అయిన 11 మందిలో ఆయన ఒకరు. అనంతరం తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కోసం గతంలో రాజీనామా సైతం చేశారు. తీర్పు విష‌యంలో ఒత్తిళ్లతోనే ఆయ‌న రాజీనామా చేశార‌ని అంటున్నారు. మ‌రోవైపు ఇంకో ఇద్ద‌రు జ‌డ్జీలు కూడా రాజీనామా చేస్తార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయ‌న్ను ఈ నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకునేందుకు కొంద‌రు చ‌ర్చిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.ఎన్ఐఏ జడ్జిగా రాజీనామా చేసిన రవీందర్‌ రెడ్డి స్వస్థలం కరీంనగర్‌ జల్లా. ప్రస్తుతం ఆయన తెలంగాణ జ్యుడీషియరీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరో రెండు నెలల్లో ఆయన పదవీ కాలం ముగియనుంది.  మ‌రోవైపు ఈ రాజీనామాపై అధికారికంగా ఏ ప్ర‌క‌ట‌న విడుద‌ల కాలేదు.

ఇదిలాఉండ‌గా... కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్‌వీఎస్ మణి స్పందించారు. ఈ తీర్పు ఊహించిందే అన్నారు. దొంగ సాక్ష్యాలు చాలా తెలివిగా సృష్టించారన్నారు. అసలు ఆ పేలుడు ఘటనలో హిందూ ఉగ్రవాదమే లేదని మణి తెలిపారు. మక్కా మసీదు పేలుడుకు కుట్ర పన్నిన వారే.. ఎన్ఐఏ ఏజెన్సీని వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశమన్నారు. పేలుడు వల్ల ఇబ్బందిపడ్డవారిని ఎలా ఆదుకుంటారని ఆయన ప్రశ్నించారు. మక్కా మసీదు పేలుడు కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ నష్టాన్ని పూరిస్తుందా అని ఆయన అడిగారు.
Tags:    

Similar News