జడ్జి రామకృష్ణ తమ్ముడ్ని రోడ్డు మీద అంత దారుణంగా కొట్టేశారు

Update: 2020-09-28 06:30 GMT
నిత్యం ఏదో ఒక వివాదంలో ఏపీ సర్కారు మీద పడుతోంది. తాజాగా చోటు చేసుకున్న వివాదం ఇప్పుడు సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన దళిత జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై కొందరు దుండగలు దాడి చేసిన వైనం సంచలనంగా మారింది. ఈ దాడిలో రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. బి.కొత్తకోట బస్టాండ్ లో పండ్లు కొనుగోలు చేస్తున్న వేళ.. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన కారులో వచ్చిన దుండగులు విచక్షణరహితంగా దాడికి పాల్పడిన వైనం ఇప్పుడు మరో వివాదంగా మారింది.

తనపై దాడి చేసింది బి.కొత్తకోట మండలం సూరపవారిపల్లెకు చెందిన కుమార్.. ఆయన అనుచరులు కలిసి దాడి చేసినట్లుగా చెబుతున్నారు. గాయపడిన రామచంద్రను స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికితరలించారు. మెరుగైన వైద్యం కోసం బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ ధాడి పథకం ప్రకారం జరగలేదని మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి పేర్కొన్నారు.

అనుకోకుండా రోడ్డుపై చోటు చేసుకున్న ఘర్షణే తప్పించి.. ఈ దాడికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంపై జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ.. ఇది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులకు.. తమ కుటుంబానికి మధ్య ఇటీవల జరుగుతున్న భూవివాదాల నేపథ్యంలోనే దాడి జరిగినట్లుగా ఆరోపించారు. స్థానిక అధికారపక్ష నేతలే తన తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై మరో కొత్త కోణాన్ని వెల్లడించారు చంద్రబాబు.

ఈ ఘటనపై ఆదివారం ఒక లేఖ రాసిన చంద్రబాబు.. అందులో కీలక అంశాల్ని పేర్కొన్నారు. శనివారం విజయవాడలో దళిత మేధావుల రౌండ్ టేబుల్ సమావేశంలో జడ్జి రామకృష్ణ పాల్గొని.. రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యల్ని ఖండించారన్నారు. ఇది జరిగిన తర్వాతి రోజునే ఆయన సోదరుడిపై దాడి జరిగిందన్నారు. న్యాయమూర్తిని భయపెట్టి.. నోరు మూయించటానికే కుట్ర పూరితంగా ఈ దాడి జరిగినట్లుగా ఆయన ఆరోపించారు. మొత్తంగా ఈ వ్యవహారం మరో వివాదంగా మారిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News