గుజరాత్‌ అల్లర్లపై న్యాయమూర్తి షాకింగ్‌ తీర్పు!

Update: 2023-06-17 15:00 GMT
ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002 ఫిబ్రవరిలో గోద్రా రైలు దహనం ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హిందూ కరసేవకులు పలువురు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఒక వర్గంపై గుజరాత్‌ లో దాడులు జరిగాయి. ఈ ఘటనలో బిల్కిస్‌ బానో అనే మహిళపై గ్యాంగ్‌ రేప్‌ చేయడమే కాకుండా ఆమె కుటుంబ సభ్యుల్లో ఏడుగురిని పొట్టన పెట్టుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ ఘటనలో జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మంది నిందితులను ఏప్రిల్‌ లో పెరోల్‌ పై గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో ఆ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు గుజరాత్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతోపాటు ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులను హత్య చేసిన 11 మంది దోషులను పెరోల్‌ పై జైలు నుంచి విడుదల చేసిన గుజరాత్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. నేడు బిల్కిస్‌ బానోకు జరిగింది రేపు ఇంకెవరికైనా జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. కేసు తీవ్రత ఏమిటో పట్టించుకోరా? మీరు అసలు మనసుపెట్టి చూశారా? అని గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది.

ఇప్పుడు ఇదే కోవలో నాడు జరిగిన హింసాత్మక ఘటనలో ముగ్గురు వ్యక్తులను చంపడంతోపాటు వారిని దహనం చేసిన వ్యవహారంలో 35 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడంపైనా విమర్శలు చెలరేగుతున్నాయి.

వందల మంది ప్రాణాలు కోల్పోయిన గుజరాత్‌ అల్లర్ల వెనుక ముందస్తు కుట్రేమీ లేదని.. ఈ కేసును విచారించిన హాలోల్‌ పట్టణంలోని అదనపు సెషన్స్‌ జడ్జి తాజాగా తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా ఇదంతా కుహనా మీడియా, బూటకపు లౌకికవాద రాజకీయ నాయకుల దుష్ప్రచారమేనని వ్యాఖ్యానించారు. 2002 సబర్మతి రైలు దహనంపై ప్రజల నుంచి ఆకస్మికంగా వెల్లువెత్తిన ఆగ్రహం వల్లే మరో వర్గం నుంచి సామూహిక దాడులు జరిగాయంటూ తన తీర్పులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆధారాలు లేవని పేర్కొంటూ ముగ్గురి వ్యక్తుల హత్య, మృతదేహాల దహనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 35 మందిని నిర్దోషులుగా ప్రకటించారు.

గుజరాత్‌లోని గోధ్రా రైలు దహనం(2002) తదనంతర అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో నిందితులైన 35 మందిని అదనపు సెషన్స్‌ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.  రైలు దహనం తర్వాత 2002 ఫిబ్రవరి 28న గుజరాత్‌ లో పంచమహల్‌ జిల్లాలోని కలోల్‌ బస్‌స్టాండ్, దెలోల్‌ గ్రామం, దెరోల్‌ స్టేషన్‌ ప్రాంతాల్లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే.

 ఈ ఘటనల్లో ముగ్గురు వ్యక్తులను దారుణంగా చంపి, మృతదేహాలను కొందరు తగులబెట్టారు. వీటికి సంబంధించి నాలుగు కేసుల్లో 52 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. విచారణ క్రమంలో 17 మంది నిందితులు చనిపోయారు. 130 మంది సాక్షులను విచారించిన అనంతరం సెషన్స్‌ కోర్టు తాజాగా తీర్పు వెలువరించారు. నిందితులపై మోపిన నేరాలకు ప్రాసిక్యూషన్‌ సరైన ఆధారాలు చూపించలేకపోయిందని జడ్జి తెలిపారు. హత్యకు వాడిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

గుజరాత్‌లో జరిగిన అల్లర్ల వెనుక.. బూటకపు లౌకికవాద మీడియా, రాజకీయ నాయకులు ఆరోపించినట్లుగా భారీ కుట్రలేమీ లేవని జడ్జి వ్యాఖ్యానించారు. రైలు దహనం తర్వాత అప్పటికప్పుడు వ్యక్తమైన ఆగ్రహంతోనే వేల మంది ప్రజలు దాడులకు దిగారని జడ్జి పేర్కొన్నారు. ముందస్తు కుట్ర ఏమీ లేదన్నారు. ముగ్గురిని చంపారనడానికి సాక్ష్యాలు లేనందున 35 మందిని నిరపరాధులుగా ప్రకటిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు.

Similar News