ఈ మ‌ధ్యాహ్నం మాజీ జ‌డ్జిగారి కొత్త పార్టీ

Update: 2017-11-18 06:18 GMT
దాదాపు ప‌ద‌కొండు నెల‌ల క్రితం వినిపించిన మాట ఇప్ప‌టికి నిజం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో మ‌రో రాజ‌కీయ పార్టీ ఊపిరిపోసుకోనుంది. అయితే.. ఈ పార్టీని స్టార్ట్ చేస్తోంది ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. రాజ‌కీయాల‌కు కాస్త దూరంగా ఉండే న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు చెందిన మాజీ న్యాయ‌మూర్తి  జ‌స్టిస్ చంద్ర‌కుమార్ ఈ రోజు మ‌ధ్యాహ్నం త‌న రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌టించ‌నున్నారు.

తెలంగాణ ప్ర‌జావేదిక అధ్య‌క్షులుగా ఉన్న ఆయ‌న‌.. తాను రాజ‌కీయ పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న‌ను గ‌తంలోనే వెల్ల‌డించారు. అయితే... అది వాస్త‌వ రూపం దాల్చ‌టానికి  కాస్త స‌మ‌యం ప‌ట్టింద‌ని చెప్పాలి. సామాజిక న్యాయం.. సామాజిక ప్ర‌జాస్వామ్యం ల‌క్ష్యాల‌తో తాను పార్టీ పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లు గ‌తంలో చెప్పిన చంద్ర‌కుమార్‌.. త‌న తాజా రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌ట‌న‌లో ఈ అంశాలు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల కాలంలో తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు మీద విమ‌ర్శ‌లు చేస్తున్న చంద్ర‌కుమార్‌.. రానున్న రోజుల్లో తెలంగాణ స‌ర్కారుకు ఇబ్బందిక‌రంగా మార‌తార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ రాష్ట్ర జ‌నాభాలో స‌గానికి పైనే ఉన్న బీసీల‌కు కేటాయించిన రిజ‌ర్వేష‌న్లు అమ‌లు కావ‌టం లేద‌న్న అసంతృప్తిని ప్ర‌క‌టించే చంద్ర‌కుమార్  రానున్న రోజుల్లో వెనుక‌బ‌డిన‌కులాల వారికి అండ‌గా.. వారి స‌మ‌స్య‌ల‌కు గొంతుక‌గా మారే అవ‌కాశం ఉంద‌ని చెప్పొచ్చు. ఈ కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌పై తెలంగాణ రాజ‌కీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
Tags:    

Similar News