సుప్రీంలో మ‌న జ‌డ్జీ మ‌ళ్లీ లేఖ రాశారు

Update: 2018-03-30 05:14 GMT
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ మ‌రోమారు త‌న గ‌ళం వినిపించారు. న్యాయవ్యవస్థలో ప్రభుత్వ జోక్యం క్రమంగా పెరుగుతుండటంతో న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటున్నదని ఆయ‌న‌ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు వ్యవస్థల మధ్య సఖ్యత పెరిగితే భవిష్యత్‌ లో ప్రజాస్వామ్యానికి మరణశిక్షగా పరిణమిస్తుందన్నారు. వెంటనే దీనిపై సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులందరితో ఫుల్‌ కోర్టును ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చించాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్‌ మిశ్రాకు లేఖ రాశారు. ఈ నెల 21వ తేదీతో జస్టిస్ చలమేశ్వర్  తన ఆరు పేజీల లేఖ ప్రతులను సీజేఐతోపాటు సుప్రీంకోర్టులోని మిగతా 22 మంది జడ్జీలకూ పంపారు. జడ్జీల నియామకంలో కేంద్రం - న్యాయశాఖ జోక్యాన్ని ఆయన తన లేఖలో ప్రశ్నించారు. జడ్జీల పదోన్నతులపై కొలీజియం నిర్ణయం తీసుకున్నా, ప్రభుత్వం తమకు అనుకూలంగా లేనివారి పేర్లను కావాలనే పక్కన పెడుతున్నదని, సాకుతో పదోన్నతులను అడ్డగించేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు.

తాజాగా కర్ణాటకలో జరిగిన ఉదంతాన్ని ఉదాహరణగా సుప్రీం జ‌డ్జి ఎత్తిచూపారు. కర్ణాటక డిస్ట్రిక్ట్ - సెషన్స్ కోర్టు జడ్జి కృష్ణభట్‌ పై 2016లో ఓ మహిళా న్యాయమూర్తి పలు ఆరోపణలు చేశారు. దీనిపై అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్‌ తో విచారణ జరిపించగా నిరాధారమని తేలింది. దీంతో కొలీజియం మరోసారి పదోన్నతుల జాబితాలో భట్ పేరును చేర్చగా కేంద్రం అభ్యంతరం తెలుపుతోంది. కేంద్రం లేఖ మేరకు కర్ణాటక హైకోర్టు ఈ మేరకు విచారణ ప్రారంభించగా జస్టిస్ చలమేశ్వర్ జోక్యం చేసుకోవడంతో నిలిపివేశారు. కర్ణాటకలోని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కృష్ణభట్‌ కు పదోన్నతి కల్పించాలని రెండుసార్లు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని నిలువరించడం కోసం జడ్జి కృష్ణభట్‌ పై విచారణ జరుపాలని నేరుగా కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్‌ కు దినేశ్ మహేశ్వరికి కేంద్ర న్యాయశాఖ లేఖ రాసిందన్నారు. ఇది సుప్రీంకోర్టు నిర్ణయాలను పక్కనబెట్టే ప్రయత్నమేనన్నారు.

కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ మనకు అండగా నిలువడం కన్నా, ప్రభుత్వ ఆదేశాల అమలుకే ప్రాధాన్యం ఇచ్చారు అని చ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం ఎప్పుడూ న్యాయవ్యవస్థ పట్ల అసహనంతోనే ఉంటున్నదని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, ప్రాధాన్యాన్ని విస్మరించి.. హైకోర్టు చీఫ్ జస్టిస్‌ లను సచివాలయంలోని విభాగాధిపతులుగా భావిస్తున్నదని విమర్శించారు. కానీ ఈ రెండు వ్యవస్థల మధ్య అతి సఖ్యత తో ప్రజాస్వామ్యానికి చేటన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. జస్టిస్ చలమేశ్వర్ లేఖపై సీజేఐ దీపక్‌ మిశ్రా ఇప్పటివరకు స్పందించలేదు.

Tags:    

Similar News