సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ..రాష్ట్రపతి ఆమోదం - ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

Update: 2021-04-06 06:53 GMT
సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్‌ ఎన్వీరమణ తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పంపిన లేఖకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎన్వీ రమణను సీనియారిటీ ప్రకారం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రస్తుత ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డే కూడా తన వారసుడిగా ఆయన పేరును సిఫార్సు చేశారు. దీనికి కేంద్ర న్యాయశాఖతో పాటు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో జస్టిస్‌ ఎన్వీరమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 23న జస్టిస్ బాబ్డే సీజేఐగా రిటైర్‌ కానున్నారు. తర్వాత రోజు జస్టిస్‌ ఎన్వీరమణ కొత్త సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.. 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ ఎన్వీ రమణ తెలుగువారు.. 1957 ఆగ‌స్ట్ 27న కృష్ణా జిల్లా పొన్న‌వ‌రంలో ఓ వ్య‌వ‌సాయ కుటుంబంలో ఆయ‌న జ‌న్మించారు. 2017 ఫిబ్ర‌వ‌రి 14 నుంచి జస్టిస్ ర‌మ‌ణ సుప్రీంకోర్టు జ‌డ్జిగా ఉన్నారు. అంత‌కుముందు ఆరు నెల‌ల పాటు ఆయ‌న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ప‌ని చేశారు. 2000 జూన్ 27 నుంచి 2013 సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కు ఎన్వీ ర‌మ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో జ‌డ్జిగా ప‌ని చేశారు.

జస్టిస్‌ రమణ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక తీర్పుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. జస్టిస్‌ కాకర్ల సుబ్బారావు తర్వాత సుప్రీంకోర్టు సీజేఐ వంటి అత్యున్నత పదవి చేపడుతున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్‌ రమణ. ప్రస్తుతం తన సొంత రాష్ట్రంలో మూడు రాజధానుల విభజన ప్రక్రియ కీలక దశలో ఉండటం, దీనికి వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో జస్టిస్ రమణ తీసుకునే నిర్ణయాలపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News