జగన్ ఆ జవాబిస్తే జ్యోతుల రాజకీయ సన్యాసమేనట

Update: 2016-06-15 06:01 GMT
మొన్నటివరకూ జగన్ కు మించిన నాయకుడు లేనట్లుగా మాట్లాడిన జ్యోతుల నెహ్రు ఇప్పుడు ఆయన మీద అగ్గి ఫైర్ అయిపోతున్నారు. పార్టీ మారిన వెంటనే నోటల నోటి మాటలు ఎంతలా మారిపోతాయనటానికి జ్యోతుల ఒక నిదర్శనంగా చెప్పాలి. రాజకీయాలు.. నిబంధనల మీద జగన్ కు అవగాహన తక్కువని తరచూ ఆరోపణలు చేసే టీడీపీ నేతల మాదిరే ఆయన కూడా అలాంటి వాదననే వినిపించారు.

ప్రజలు తనకు ప్రతిపక్ష హోదాను ఇచ్చినట్లుగా జగన్ చెప్పుకున్నారని.. అసలు ప్రతిపక్షం ఏమిటో జగన్ చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షం అంటే అధికార పార్టీని విమర్శించటమే కాదని.. నిర్మాణాత్మక పాత్రను పోషించాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. శాసన సభల్లో కానీ.. యాత్రల్లో కానీ ప్రభుత్వానికి జగన్ ఒక మంచి సూచన ఇచ్చిన పాపాన పోలేదని.. అలాంటిదేమైనా ఒక్కటి ఉన్నా తాను రాజకీయాల నుంచి శాశ్వితంగా వైదొలుగుతానని సవాలు విసిరారు.

ప్రతిపక్ష నేతగా తన బాధ్యత ఏమిటో తెలీని వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఏపీ ప్రజలకు దొరకటం దౌర్భాగ్యమని జగన్ మీద విమర్శలు చేసిన ఆయన..  అవినీతి గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని వ్యాఖ్యానించారు. మొన్నటి వరకూ తాను జగన్ పార్టీలోనే ఉన్నానని.. ఆయన్ను నాయకుడిగా భావించిన నేపథ్యంలో అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిదని తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరి.. జ్యోతుల ప్రశ్నకు జగన్ సమాధానమిస్తారా?
Tags:    

Similar News