ఇంతకాలంలో ఏమైపోయారో జ్యోతుల నెహ్రూ!

Update: 2018-07-31 05:51 GMT
వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ తరువాత చాలాకాలంగా సైలెంటైపోయారు. టీడీపీలో తగిన ప్రాధాన్యం దొరక్కపోవడంతో బాగా అసంతృప్తికి కూడా గురయ్యారు. అయితే... ఏమైందో ఏమో కానీ సడెన్ గా తన మాజీ బాస్ జగన్‌ పై విరుచుకుపడడం మొదలుపెట్టారు. ఏకంగా జగన్‌కే ఆయన సవాల్ విసురుతున్నారు. రూ.10 కోట్లు ఇచ్చి తన ఆస్తులు తీసుకోవాలని ప్రతిపాదన పెట్టారు. టీడీపీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు డబ్బు తీసుకుని ఆ పార్టీలో చేరారన్న జగన్ ఆరోపణలకు ప్రతిగా ఆయన ఈ సవాల్ విసిరారు. తన ఆస్తులు రూ.10 కోట్లు కూడా చేయవన్నట్లుగా ఆయన మాట్లాడారు.
   
టీడీపీ పెద్ద ఎత్తున డబ్బులను ఎరగా చూపి వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తోందని, టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలందరూ డబ్బులు తీసుకున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను నెహ్రూ ఖండించారు. తనకు పది కోట్ల రూపాయలు ఇస్తే తన మొత్తం ఆస్తిని జగన్‌ కు రాసిచ్చేస్తానని సవాలు విసిరారు. తనకు చాలా వరకు అప్పులున్నాయని - ఆ పది కోట్లతో అప్పులు కూడా తీర్చుకుంటానని పేర్కొన్నారు. జగన్‌ కు దమ్ముంటే తన సవాలుకు ముందుకు రావాలన్నారు. జగన్ ఓ పరిపక్వత లేని నేత అని దుయ్యబట్టారు. రాజకీయాలకు ఆయన పనికిరారని నెహ్రూ ఫైరయ్యారు.
   
అయితే... నెహ్రూ ఇంతకాలం కలుగులో దాక్కుని ఇప్పుడు బయటకు రావడంపై రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. టీడీపీలో ఆయనకు టిక్కెట్ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో జగన్ పై విమర్శలు చేసి చంద్రబాబు మెప్పు పొందాలనే ప్రయత్నం మొదలుపెట్టారని వినిపిస్తోంది. ఆ క్రమంలోనే ఆయన ఇలా సవాళ్లు విసురుతున్నారని టాక్. జ్యోతుల ఏమేం చేస్తారో.. ఆయన ఆస్తిపాస్తులేమిటో తూర్పుగోదావరి ప్రజలకు తెలుసని.. ప్రత్యేకంగా సవాళ్లు విసిరి ఇరకాటంలో పడొద్దని వైసీపీ నేతలు అంటున్నారు.
Tags:    

Similar News