బాబూ... జ్యోతుల మాట విన్నారా?

Update: 2019-06-13 13:49 GMT
తాజా ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే టీడీపీ ఓడిపోయిందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సహా పార్టీ నేతలంతా కోడై కూస్తున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రోజున కూడా బాబు ఇదే ఆరోపణలు చేశారు. అంతకుముందు కూడా ఈవీఎంల రద్దు కోసం నానా యత్నాలు చేసిన చంద్రబాబు... పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిన మాట నిజమేనని - దానిని నివారించి ప్రజలిచ్చిన వాస్తవ తీర్పు ఏమిటన్న దానిని తేల్చేందుకు కనీసం 50 వీవీ ప్యాట్లనైనా లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దిశగా ఆయన ఏకంగా 22 పార్టీలతో కలిసి సుప్రీంకోర్టు గడప కూడా తొక్కారు. అయితే బాబు పోరాటం సరికాదని - టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటే తాను నమ్మబోనని కూడా ఆ నేత చంద్రబాబుకు ఝలక్కిచ్చారు.

బాబుకు దిమ్మతిరిగేలా వ్యాఖ్యలు చేసిన సదరు నేత ఎవరు? ఆయన ఏమన్నారన్న విషయానికి వస్తే... గడచిన ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల నెహ్రూ... చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై టీడీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జగ్గంపేట నుంచే పోటీ చేసి తన సోదరుడి కుమారుడు జ్యోతుల చంటిబాబు చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో బుధవారం జగ్గంపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్నికలకు సంబంధించిన విషయాలపై మాట్లడిన జ్యోతుల నెహ్రూ... ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటే తాను నమ్మనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు మార్పు కోరుకున్నారని - ఆ క్రమంలోనే టీడీపీకి ఓటమి దక్కగా - వైసీపీకి బంపర్ మెజారిటీతో విక్టరీ దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ వైపు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని పార్టీ అధినేత సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా పోరుతుంటే... నెహ్రూ మాత్రం అందుకు విరుద్ధంగా ట్యాంపరింగ్ అన్న మాటే లేదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలమే రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలు బాబు చెవినపడ్డాయో, లేదో తెలియదు గానీ.. ఒకవేళ చెవినపడితే మాత్రం బాబు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News