ఇప్పుడే ఇలా మాట్లాడితే..మున్ముందు రచ్చేనేమో?

Update: 2016-04-11 12:01 GMT
జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరడానికి ఇంకా కొన్ని గంటలు ఉందనగానే, ఆయన ఇంకా పార్టీలో చేరకముందే... టీడీపీతో మైత్రి కొనసాగిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలో ఒక రకంగా మాట్లాడితే జ్యోతుల మరోరకంగా మాట్లాడి టీడీపీలో కలకలం రేపారు. పవన్ రీసెంటు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక అంశాలపై మాట్లాడిన సంగతి తెలిసిందే. దానిపై స్పందించిన జ్యోతుల... ‘‘పవన్ కల్యాణ్ ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు.. హైదరాబాద్ లో ఒకలా, ఆపై తుళ్లూరుకు వచ్చి మరోలా మాట్లాడే ఆయన్ను ఎలా నమ్మాలి’’ అని ప్రశ్నించారు. ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతిస్తామని, అయితే, పవన్ చెప్పే మాటలపై తనకు విశ్వాసం లేదని అన్నారు. నిన్న ఒక మాట చెప్పి, ఆపై రేపు తాను చెప్పినదానికే భిన్నంగా వ్యాఖ్యానించడం ఆయన నైజమని విమర్శించారు. ఆయన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.

జ్యోతుల ఈ రకంగా మాట్లాడగా తెదేపా ఎమ్మెల్యే బొండా పవన్ విషయంలో వేరేలా స్పందించారు. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడాన్ని ఓ మిత్రపక్షంగా స్వాగతిస్తున్నామని బొండా ఉమ అన్నారు. పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో భాగస్వామ్యంతోనే బరిలోకి దిగుతారని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఆయన తమకు మద్దతిచ్చారని, ప్రచారం కూడా చేశారని గుర్తు చేసిన బొండా ఉమ ఇకపై కూడా ఓ జట్టుగా ముందుకు వెళితేనే మంచిదని అన్నారు. సాధారణంగా పార్టీ స్వరాన్ని వినిపించే బొండా మాటలు వ్యక్తిగతం కాదని... పార్టీ వాయిస్ అనే చెప్పాలి.  ఆ రకంగా టీడీపీ పవన్ విషయంలో కలిసి వెళ్లాలన్నట్లుగా మాట్లాడుతుంటే ఇంకా పార్టీలోకి రాని జ్యోతుల పవన్ తో వ్యవహారం చెడేలా మాట్లాడుతుండడంతో టీడీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. పార్టీలోకి జ్యోతుల వచ్చిన తరువాత అధినేతతో చర్చించి ఆయన నోటికి కాస్త అదుపులో పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇప్పుడే ఇలా తోచినట్లుగా మాట్టాడేస్తున్న ఆయన పార్టీలోకి వచ్చాకా ఇలాగే మాట్టాడితే ఇబ్బందేనని అంటున్నారు.
Tags:    

Similar News