తెదేపాలో అందరికీ ఈ బాగోతం ముందే తెలుసా?

Update: 2017-10-16 00:30 GMT
‘భార్య చేసే తప్పు గురించి ఊరందరికీ తెలిసిపోయిన తర్వాతే.. చిట్టచవరగా భర్తకు తెలుస్తుందని’ తెలుగుపల్లెపట్టుల్లో ఒక మొరటు సామెత ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబునాయుడు ప్రభుత్వం పనిచేస్తున్న తీరు కూడా ఆ సామెత చందంగానే కనిపిస్తోంది. ప్రభుత్వంలో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతున్నదో ప్రభుత్వంలోని, తెలుగుదేశం పార్టీలోని చాలా మంది పెద్దలకు విపులంగా తెలుసునని... కాకపోతే.. మీడియా ద్వారా బయల్పడిన తర్వాత.. అందరూ ఈ అవినీతి గురించి ఇప్పుడే తెలిసినట్లుగా అభినయిస్తున్నారని అమరావతిలో పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. కాపు కార్పొరేషన్ ఎండీ అమరేంద్రను పదవినుంచి తప్పించిన తర్వాత.. ఇలాంటి ప్రచారాలు వినిపిస్తున్నాయి.

కాపు  కార్పొరేషన్ లో అసలు ఏం జరుగుతున్నదో తెలుగుదేశం లోని చాలా మందికి ముందునుంచి తెలుసునని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర రావు నిర్వహించిన ప్రెస్ మీట్ ను దీనికి ఉదాహరణగా పలువురు పేర్కొంటున్నారు. జూపూడి కొన్ని రోజుల కిందట ఓ ప్రెస్ మీట్ పెట్టి.. తాను సారధిగా ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటిదాకా ఏం పనులు చేశామో.. తమకు ఎన్ని నిధులువచ్చాయో ఎలా ఖర్చయ్యాయో.. ఎవరెవరికి ఎలాంటి సాయం చేస్తూ వచ్చామో ... సకల వివరాలను వెల్లడించారు.

ఇదే సమయంలో జూపూడి చెప్పిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. తమ ఎస్సీ కార్పొరేషన్ లాగానే.. రాష్ట్రంలో ఉన్న ఇతర కార్పొరేషన్ ల వారు కూడా.. ఇలాగే తమ తమ పరిధిలో ఏం జరుగుతున్నదో.. శ్వేతపత్రాలు విడుదల చేయాలని జూపూడి సూచించారు.

నిజానికి ప్రభుత్వ వ్యతిరేక ప్రత్యర్థి పార్టీలే శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్ ను వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రం ప్రభుత్వ పక్షానికే చెందిన నాయకుడు డిమాండ్ చేయడం విశేషం.

కాపు  కార్పొరేషన్ లో అవినీతి తిమింగలాలు తిష్ట వేసి ఉన్న సంగతి జూపూడికి మాత్రమే కాకుండా.. పలువురికి ముందే తెలుసునని.. అందుకే వారి బాగోతాలకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే.. అన్ని కార్పొరేషన్లు శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారని కూడా పలువురు అనుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ .. తమకు అసలు నిధులు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వం పరువు తీసింది. ఇప్పుడు కాపు కార్పొరేషన్.. తమ చేతిలో నిధులు ఉండేసరికి ఎడాపెడా స్వాహా చేసేస్తూ ప్రభుత్వానికి పరువు తీసింది. ఇలా బాబు ప్రభుత్వానికి ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు వేచి ఉన్నాయో అని పలువురు అనుకుంటున్నారు.
Tags:    

Similar News