జ‌గ‌న్ వెంట కుటుంబం ఉంది..మీ వెంట ఉందా?

Update: 2017-07-29 00:30 GMT
ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిప‌డ్డారు. విలువలు లేని వారు నీతులు చెప్తారా?  మోసాల్లో పుట్టి.. మోసాల్లో పెరిగిన వారు హిత బోధలు చేస్తారా? గెలిచిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారు సంప్రదాయాల గురించి మాట్లాడతారా? అంటూ నిప్పులు చెరిగారు.  వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దన్ రెడ్డి - ఆదిమూలపు సురేష్ నంద్యాలలోని వైఎస్ ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ త‌మ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌పై మంత్రుల విమ‌ర్శ‌లు స‌రికాద‌ని అన్నారు. వైఎస్ జగన్ వెంట ఆయన కుటుంబం ఉంది, చంద్రబాబు వెంట ఆయన కుటుంబం ఉందా? అని ప్ర‌శ్నించారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడవలేదా? కుటుంబాన్ని చీల్చలేదా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

పార్టీ మారిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి, 4 సార్లు ఓడిపోయిన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి అని అలాంటి వ్య‌క్తి త‌మకు నీతులు చెప్ప‌డం ఏంట‌ని వైసీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ త‌ప్పుప‌ట్టారు. 9 ఏళ్లపాటు గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబుకు, 2014 నుంచి అధికారంలో ఉన్న చంద్రబాబుకు నంద్యాల అభివృద్ధి కనిపించలేదా అని ప్ర‌శ్నించారు. ``నంద్యాల అభివృద్ధి ఇప్పుడే గుర్తురావడం వెనుక కారణం ఏంటి? భూమా నాగిరెడ్డి పార్టీ మారిన తర్వాత అభివృద్ధి ఏమయ్యింది? ఆ ఏడాది కాలంలో ఒక్క పనైనా జరిగిందా? ఎందుకు చేయలేదు? శాసనసభ్యుడు చనిపోతే...అభివృద్ధి ఆలోచన రాదని...సాక్షాత్తూ పార్టీ మారిన ఎస్వీమోహన్ రెడ్డి అన్నారు. మీ ఆలోచనా ధోరణి ఇదేనా...అంటే ఎవరైనా చనిపోతేనే ఆలోచిస్తామన్న ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సమాధానం ఏంటో మంత్రులు కేఈ - చంద్రమోహన్ రెడ్డి - ఆదినారాయణ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

గుంపులు గుంపులుగా ఎవరు వస్తారో? సింహంలా ఎవరు వస్తారో కేఈ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఒక్కడే సింహంలా సింగిల్ గా వస్తారని తెలిపారు. ``మీలా సందుసందుకి మంత్రిని - ఎమ్మెల్యేను నంద్యాలలో పెట్టలేదు. రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టడానికి వైఎస్ జగన్ రావడంలేదు. ఈ ప్రాంతానికి ఏం చేయదలచుకున్నారో.. తాను స్పష్టంగా చెప్పడానికి వైఎస్ జగన్ వస్తున్నారు. ఇంతకీ ప్రభుత్వంలో కేఈ పరిస్థితి ఏంటి? రాజధాని కమిటీలో రెవిన్యూ మంత్రిగా ఆయన ఎందుకు లేరో కేఈ చెప్పగలరా? కేఈ చేసిన ఆర్డీఓ బదిలీలను చంద్రబాబు రీకాల్ చేయడం ఆయనకు అవమానం కాదా? చంద్రబాబు ఏకంగా సర్క్యులరే ఇచ్చారు. విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి.. రాసిచ్చిన ప్రకటనను మాత్రమే చదవగలనన్న కేఈ పరిస్థితి ఏంటి? అలాంటి వ్యక్తి.. వైఎస్ జగన్ నుంచి మాట్లాడ్డం విడ్డూరం`` అని ఎమ్మెల్యేలు ప్ర‌శ్నించారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలలో సీఎం అవుతారా అని మంత్రులు ఎద్దేవా చేస్తున్నార‌ని అయితే...2019 తర్వాత చంద్రబాబు పరిస్థితి ఏంటో కనీసం కలకనగలరా అని ఎమ్మెల్యేలు సూటిగా ప్ర‌శ్నించారు. ఏపీ చిత్రపటం నుంచి చంద్రబాబు మాయం అయ్యాక ఆయన పరిస్థితి ఏంటో... ఊహించగలరా? అని వ్యాఖ్యానించారు. తాము కలలు కనడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు స్ప‌ష్టం చేశారు. టీడీపీ నాయకులకు, చంద్రబాబుకు కలలో కూడా జగన్ కనిపిస్తున్నారని, వారికి జగన్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. ``వ్యవసాయ శాఖ మంత్రి చంద్రమోహన్ రెడ్డిని మేం బ్రూస్ లీ అని పిలుచుకుంటాం. చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సంస్కారం గురించి మాట్లాడ‌టం.. గురివింద సామెతను గుర్తుచేస్తుంది. ఆయన నంద్యాలలో మాట్లాడొచ్చు. కాని నెల్లూరులో మాట్లాడితే జనం ఫక్కున నవ్వుకుంటారు. చంద్రమోహన్ రెడ్డి బతుకుగురించి నంద్యాల ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి. కుటుంబ సభ్యుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తని నెల్లూరు జిల్లా ప్రజలు చెప్పుకుంటారు. కావాలంటే మీడియా ఆయన్ని ప్రశ్నించండి. ఏమంటారో చూద్దాం. ఇలాంటి వ్యక్తికి ఓటెయ్యొద్దు.. అని సాక్షాత్తూ కుటుంబ సభ్యులే.. ఆయనికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ ప్ర‌క‌టించారు. రైతు రథంపేరిట ట్రాక్టర్లకు మామ్మూళ్లు - పసుపు కుంభకోణాలతో చంద్రమోహన్ రెడ్డి అవినీతి సంపాదనలో తీరికలేకుండా ఉన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇంటిపక్కనే నకిలీ ఎరువులు తయారుచేసిన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి. అందుకే చంద్రబాబు వ్యవసాయశాఖ మంత్రి పదవి ఇచ్చాడు. తన మార్గదర్శకత్వంలో మరింత సంపాదిస్తారని పదవి ఇచ్చారు.`` అంటూ ఎద్దేఆ చేశారు.
 
 తమమీద ఉన్న కేసులు తొలగించుకోడానికి జీవోలు ఇచ్చుకుంటున్న వ్యక్తులు టీడీపీ నేత‌ల‌ని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.`` అభియోగాలపై మీరెప్పుడైనా విచారణ ఎదుర్కొన్న చరిత్ర ఉందా? సాంకేతిక కారణాలు చూపి విచారణను నిలిపి వేయించుకున్న చరిత్ర మీది కాదా? సిలికా మైనింగ్ లో, మట్టిలో, నీరు- చెట్టులో దోపిడీ చేస్తున్నది చంద్రమోహన్ రెడ్డి కాదా? చంద్రబాబు నిర్దోషి అయినా.. ఎవరైనా క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భం ఉందా? ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టి హైదరాబాద్ నుంచి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు. ఓటుకు కోట్లు కేసు ముగిసిన అధ్యాయం కాదని కేసీఆర్ ఓ పక్క అంటున్నారు. దీనికోసం తెలంగాణలో రాజకీయాన్ని పదేళ్ల రాజధానినీ చంద్రబాబు వదిలిపెట్టి పారిపోయి వచ్చారు. అలాంటి వ్యక్తి నీతి గురించి చెప్పడం విడ్డూరం. ఆయన నిప్పు అని చెప్పుకోవడం హాస్యాస్పదం. టీడీపీ నాయకులు ఇరుక్కున్న కుంభకోణాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్టీఆర్ కు పాదాభివందనం చేసి... టిక్కెట్టు తెచ్చుకొని, తర్వాత చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచిన చంద్రమోహన్ రెడ్డికి.. రాజకీయ సంప్రదాయాల గురించి మాట్లాడే హక్కు ఉందా? చంద్రమోహన్ రెడ్డికి ఓట్లు కన్నా.. నోట్లంటే ఆసక్తి. ఇనుమును ఆకర్షించే అయస్కాంతం లాగ నోట్లు చూడగానే.. చంద్రమోహన్ ... ఆకర్షితుడు అవుతాడు. అందుకే ఉప ఎన్నికలంటే. ఆయనకు చాలా ఇంట్రెస్టు. ఎన్నికలు కాగానే.. ఇక స్థిరాస్థి కొనడం ఆయనకు అలవాటు. అందుకే మంత్రులు నోట్లు ఏరుకోడానికి వ స్తున్నారు`` అని మండిప‌డ్డారు.

పార్టీ ఫిరాయించి మంత్రి ప‌ద‌వి పొంది ఆదినారాయణ రెడ్డికీ సంప్రదాయం గురించి మాట్లాడే హక్కు లేదని ఎమ్మెల్యేలు స్ప‌ష్టంచేశారు. ``  నంద్యాల వైఎస్సార్సీపీ సీటు. వైఎస్ జగన్ బి-ఫారంకు ప్రజలు ఇచ్చిన తీర్పు. 3.75 లక్షల కోట్ల అవినీతిపై ఆధారాలతో మేం పుసక్తం ఇచ్చాం దీనిపై సీబీఐ విచారణ సిద్ధమా? దమ్మూ, ధైర్యం మీకు ఉందా? మీలా మేం కేవలం మాటలతో ఆరోపణలు చేయలేదు. పదవికోసం ఎగబాకి, పదవులకోసం దిగజారిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఏ పార్టీ నుంచి ఆయన గెలిచాడు? ఏ పార్టీలో ఉన్నాడు.. ఇప్పుడు ఏ పార్టీ గురించి విమర్శిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు చేశాడు? వైఎస్ జగన్ నిలబెట్టారని ప్రజలు నీకు ఓటు వేశారు. ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచి...నీ చరిత్ర కలిగిన ఆదినారాయణ రెడ్డి.. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. చేసిన పనికి సిగ్గుపడాల్సిన మనిషి.. ఇప్పుడు బరి తెగించి మాట్లాడుతున్నారు. ఆశ్రయం పొందిన చెట్టునే కూల్చడానికి యత్నిస్తున్న మనిషివి నువ్వు. తల్లిపాలు తాగి.. రొమ్ము గుద్దే వ్యక్తివి. ఇలాంటి వారికి పుట్టగతులు ఉండవని చరిత్ర చెప్తోంది. ఇలాంటి మనిషి మంచి, చెడు గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం.అమ్ముడు పోయిన మనిషి ఆదినారాయణ రెడ్డి. అసలు ఆదినారాయణ రెడ్డికి ఉన్న సత్తా ఏంటి? సత్తా ఉన్నమనిషి... రాజీనామా చేసి.. పోటీచేసి గెలుపొందాలి. కుటుంబాలను గురించి మాట్లాడే నైతిక హక్కు ఆదినారాయణ రెడ్డికి ఉందా? వైఎస్ జగన్ కుటుంబం.. ఆయన వెంట ఉంది

మరి చంద్రబాబు వెంట ఆయన కుటుంబం ఉందా? అధికారం కోసం మామకు వెన్నుపోటు పొడిచి.. కుటుంబాన్ని చీల్చిన నీచ సంస్కృతి ఉన్న నాయకుడి కింద ఉన్న వ్యక్తి కుటుంబాల గురించి మాట్లాడ్డమా?  మంత్రులు చవకబారు మాటలు, విమర్శలు మానుకోండి`` అని స్ప‌ష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతే పుట్టగతులు ఉండవని చంద్రబాబుకు తెలుసు. అందుకే అన్ని కుయుక్తులు పన్నుతున్నార‌ని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News