క‌ళా వారి కొత్త కోరిక బాగుందే

Update: 2016-07-24 10:13 GMT
రాజ‌కీయాల‌న్నాక ముందు గుర్తింపు - ఆ త‌ర్వాత అధికారం చ‌లాయించ‌డం కామ‌న్‌. అయితే, ఈ అధికారం అర‌వై ర‌కాలు. పార్టీలో ఉంటే ఉండే అధికారం ఒక ర‌కంగా - ఎమ్మెల్యేగా ఉంటే అధికారం మ‌రోర‌కంగా - ఇక మంత్రిగా పొందే అధికారం మ‌హ‌త్త‌ర ర‌కంగా ఉంటుంద‌ని భావిస్తారు నేతాశ్రీలు. మంత్రి ప‌ద‌విని మించింది లేద‌ని త‌ల‌పోస్తారు. అది ద‌క్కితే చాల‌ని ఎన్నో క‌ల‌లు సైతం క‌నేస్తుంటారు. నిజ‌మేక‌దా.. మంత్రిగా ఉంటే ఉండే ద‌ర్ప‌మే వేరు. అడుగడుగునా సెల్యూట్‌ లు - మ‌ర్యాద‌లు వ‌గైరా వ‌గైరా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటున్నారా? అక్క‌డికే వ‌చ్చేద్దాం. ఇటీవ‌ల ఓ స‌మీక్షా స‌మావేశం సంద‌ర్భంగా చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంతే! రాష్ట్రంలోని అధికార పార్టీలో ఆశావాహుల‌కు మినిస్ట‌ర్ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది.

  ఎవ‌రికివారు త‌మ వంతుగా కేబినెట్ సీటు కోసం హాట్ హాట్‌ గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఈ కోవ‌లోనే త‌న‌దైన శైలిలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు. అదేంది.. ఆయ‌న ఇప్ప‌టికే ఏపీ టీడీపీ మొత్తానికి అధ్య‌క్షుడు క‌దా? ఇంకెందుకు మంత్రి ప‌ద‌వి అంటున్నారా? అక్క‌డే త‌ప్పులో కాలేశారు. ఆయ‌నకు ఆ ప‌ద‌విపై ఏమాత్ర‌మూ ఇష్టం లేద‌ని ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉంటున్న కొంద‌రు చెబుతున్నారు. ఎందుకంటే ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా పేరుకు మాత్ర‌మే తాను ఉన్నా అన్ని నిర్ణ‌యాలు చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేషే తీసుకుంటున్నాడ‌న్న అసంతృప్తి క‌ళాలో ఉంద‌ని ఆయ‌న కాస్త అసంతృప్తితో ఉన్నార‌ట‌. దీంతో క‌ళా కేబినెట్ విస్త‌ర‌ణ‌లో త‌న‌కు మంత్రి ప‌ద‌వి కావాల‌ని చంద్ర‌బాబుపై ఒత్తిడి చేస్తున్నార‌ట‌.

   ప్ర‌స్తుతం ఎలాగూ శ్రీకాకుళం నుంచే ఒకే ఒక్కరు మంత్రివర్గంలో ఉండటంతో... తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయ‌న విజ్థ‌ప్తి చేశార‌ట‌. మ‌రో మెట్టు దిగివ‌చ్చి.. తనకు ఏపీ టీడీపీ చీఫ్ పదవి వద్దని... మంత్రిగా అవకాశం ఇస్తే చాలని కూడా అనేశార‌ట‌. దీనికి సంబంధించి క‌ళా.. సీఎం చంద్ర‌బాబుకు ఏమేం కార‌ణాలు చెప్పారో తెలియ‌దు. ఇక‌,  క‌ళాతో త‌న‌కున్న ప్ర‌త్యేక అనుబంధం నేప‌థ్యంలో బాబు చూద్దాం అని అన్న‌ట్టు టాక్‌.

   ఇక‌, క‌ళా విష‌యం ఇప్పుడు తెలుగు దేశం ఎమ్మెల్యేల్లో హాట్ టాపిక్‌ గా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈయ‌న తూర్పు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డం - రాష్ట్రంలో చంద్ర‌బాబు.. కాపుల‌కు ఏదో చేస్తాన‌ని చెప్ప‌డం త‌ప్ప చేయ‌డం లేద‌ని ఓ వ‌ర్గం ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో... తాను కాపుల‌కు వ్య‌తిరేకం కాద‌ని నిరూపించుకునే క్ర‌మంలో చంద్ర‌బాబు క‌ళాకి అవ‌కాశం క‌ల్పించ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం సాగుతోంది. ఏదేమైనా.. మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించ‌క‌త‌ప్ప‌ద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.
Tags:    

Similar News