జగన్ కు ఆ ఎమ్మెల్యే షాక్ ఇస్తాడా ?

Update: 2015-11-05 06:35 GMT
   
రాష్ట్రస్థాయిలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ​ ​
వైపు నడుస్తున్నారు. వారిని టీడీపీ వైపు నడిపించడంలో ఆ పార్టీ మంత్రులూ పైకి కనిపించకుండా పనిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. ప్రతిపక్ష పార్టీకి చెందిన పాతపట్నం శాసనసభ్యుడు కలమట వెంకటరమణకు మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. కలమట టీడీపీ నుంచే వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు... ఆయన వైసీపీకి వెళ్లిన తరువాత అచ్చెన్న - కలమటల మధ్య దూరం పెరిగింది. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉండేవారు. అయితే కొద్దికాలంగా కలమట - అచ్చెన్న మళ్లీ దోస్తులయ్యారని తెలుస్తోంది. అంతేకాదు... కలమట టీడీపీలోకి రావడానికి ఉత్సాహంగా ఉన్నారనీ తెలుస్తోంది.
   
నాలుగు రోజుల కిందట పాతపట్నం నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమాల్లో అచ్చెన్న - కలమటలు చెట్టపట్టాలేసుకొని తిరగడం అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. ఇంతకుముందు అచ్చెన్న మంత్రి హోదాలో పాతపట్నంలో కార్యక్రమాల్లో పాల్గొంటే కలమట ఆ ఛాయలకే వచ్చేవారు కాదు.  ఇప్పుడు మాత్రం ఇద్దరూ ఒక్కటైనట్లుగా కనిపిస్తోంది. అయితే, దీనికి భిన్న కారణాలు వినిపిస్తున్నాయి. కలమట టీడీపీలోకి రావాలనుకోవడం ఒక కారణమైతే.... జిల్లాలో కాపువర్గం నుంచి పట్టు కోల్పోకుండా ఉండేందుకు అచ్చెన్నాయుడే కలమటను దువ్వుతున్నారన్నది రెండో కారణం.
   
అచ్చెన్న ఎందుకు దువ్వుతున్నారా అంటే దానికీ కారణం ఉంది. శ్రీకాకుళం జిల్లాకే చెందిన కాపు నేత కిమిడి కళావెంకట్రావుకు చంద్రబాబు ఏకంగా ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించారు. దీంతో నిన్నమొన్నటి వరకు జిల్లాలో హోల్ అండ్ సోల్ మంత్రిగా హవా నడిపించిన అచ్చెన్న ప్రాబల్యానికి గండి పడింది. ఇష్టమున్న లేకపోయినా అచ్చెన్న వెనుక తిరుగుతున్న నేతలు కొందరు ఇప్పుడు కిమిడి ఇంటికి క్యూ కడుతున్నారు. దీంతో కాపు నేతలు తనకు దూరమైతే కష్టమని గుర్తించిన అచ్చెన్న సొంత పార్టీలో ఉన్నవారిని ఆపలేం కాబట్టి పక్క పార్టీ నేతలను తెచ్చుకుని తన బలం తగ్గకుండా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కలమట వెంకటరమణను టీడీపీలోకి తెచ్చి కాపు నేతలు తన వెంటా ఉన్నారని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
   
ఇక కలమట విషయానికొస్తే ఆయన తండ్రి కలమట మోహనరావు పాతపట్నం కేంద్రంగా ఎన్టీరామారావు టైం నుంచి చంద్రబాబు వరకు పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి  వివాద రహితుడిగా - సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. కలమట వెంకటరమణ కూడా తండ్రితో పాటు టీడీపీలో ఉంటూ మంచి నేతగా ఎదిగారు. అయితే... 2009 ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన శత్రుచర్ల విజయరామరాజు 2014లో టీడీపీలోకి వచ్చి టిక్కెట్ అందుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వెంకటరమణ వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఒరిస్సా బోర్డర్ లో ఉంటూ కాపులు - గిరిజనులతో నిండిన నియోజకవర్గమైన పాతపట్నంలో మొదటి నుంచి టీడీపీకి పట్టుంది. రమణ కూడా వ్యక్తిగత ప్రభతోనే గెలిచారు కానీ వైసీపీ వల్ల ఏమీ కాదు. దీంతో ఆయన చాలాకాలంగా పాత గూటికే రావాలనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు ఆయన్ను లాక్కొస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్న శాసనసభ్యునిగా కలమట రమణ జడ్పీటీసి సభ్యుడిగా ఇద్దరూ కలిసి జిల్లా పరిషత్తు సర్వ సభ్య సమవేశాల్లో కాంగ్రెస్ ను ముప్పతిప్పలు పెట్టేవారు. ఆ సంగతులు... కలమట మోహనరావు హయాం నుంచి తెదేపాలో కింజరాపు కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తూ అచ్చెన్న కలమటతో కలిసిపోయారు. ఇక కలమట టీడీపీలోకి రావడమే మిగిలింది. కలమట కుటుంబానికి టీడీపీతో ఉన్న దశాబ్దాల అనుబంధం, యువకుడైన కలమట రమణకు శ్రీకాకుళం జిల్లాలోని కాపుల్లో ఉన్న పట్టు రీత్యా చంద్రబాబు కూడా అడ్డుచెప్పకపోవచ్చు.  ఈ లెక్కన జగన్ కు ఇంకో ఎమ్మెల్యే తగ్గుతున్నట్లే.
Tags:    

Similar News