కళానికేతన్ ఎండీ అప్పుల భాగోతం లెక్కేంటి?

Update: 2016-01-10 06:52 GMT
ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కళానికేతన్ ఎండీ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆయనపై పలు ఆరోపణలు.. కేసులు నమోదు కావటం.. తాజాగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయటం వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. భారీ షోరూంలో వ్యాపార కలాపాలు సాగించటం.. ఇలాంటి సముదాయాలు పలు ఉండటం ఒకటైతే.. ఇతగాడి అప్పులు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

వ్యాపార వర్గాల సమాచారం మేరకు.. కళానికేతన్ ఎండీ లీలాకుమార్ కు చెందిన ఒక చిట్టి వీడియో ఒకటి వాట్సప్ లలో చక్కర్లు కొడుతోంది. సూరత్ కు చెందిన వ్యాపారులు సదరు ఎండీని చొక్కా విప్పదీసి.. అప్పుల గురించి నిలదీయటం.. తనకు టైం ఇవ్వాలంటూ వేడుకోవటం లాంటివి ఇందులో కనిపిస్తాయి. నిజానికి ఈ చిట్టి వీడియో కొద్ది నెలల కిందటే చక్కర్లు కొట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా రూ.3.5కోట్లు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండిపోయినట్లుగా ఎవీఎన్ రెడ్డి అనే వ్యాపారి చేసిన ఫిర్యాదుతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు.. ఆయన సతీమణిని కూడా అరెస్ట్ చేశారు. కళానికేతన్ ఎండీ తీవ్రమైన అప్పుల ఊబిలో చిక్కుకుపోయినట్లుగా చెబుతున్నారు. సూరత్ వ్యాపారులకు దాదాపు రూ.63 కోట్లు (అనధికార సమాచారం ప్రకారం రూ.150 కోట్లకు పైనే).. అద్దెలు.. ఇతర బకాయిల కింద మరో రూ.50కోట్లు ఉన్నాయని.. ఇవి కాకుండా భారీగా అప్పులు ఉన్నట్లుగా చెబుతున్నారు. పేరు మోసిన ఒక వ్యాపార సంస్థ అప్పుల భాగోతం ఇంత భారీ స్థాయిలో ఉండటం ఏమిటి? ఎందుకిలా జరిగిందన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.
Tags:    

Similar News