వామ్మో..కల్కి భగవాన్ ఆస్తుల విలువ ఇదీ

Update: 2019-10-19 04:29 GMT
కలియుగ ప్రత్యక్ష దేవుడిగా తనకు తాను ప్రకటించుకున్న ‘కల్కి భగవాన్’ పై ఐటీ దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. ఏకంగా 500 కోట్ల ఆస్తులు బయటపడడం కలకలం రేపింది..

మూడు రోజులుగా చిత్తూరు జిల్లా వరదాయపాలెం లోని కల్కి భగవాన్ ఆశ్రమంతోపాటు తమిళనాడు - తెలంగాణ - కర్ణాటక ఇతర ప్రాంతాల్లో ఐటీ అధికారులు చేస్తున్న సోదాల్లో కట్టల పాములు వెలుగుచూశాయి.. కట్టల కొద్దీ నగదు - కోట్ల విలువైన బంగారం - నగలు - వజ్రాలు - వందల కోట్ల అక్రమాస్తులు బయటపడడం ఐటీ అధికారులను షాక్ కు గురిచేసింది.

కల్కి భగవాన్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి, వ్యాపారాలు చేస్తున్నట్టుగా తేలింది. కల్కి దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నాడని ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ అధికారుల దాడుల్లో ఏకంగా 43.9 కోట్ల నగదు, 18 కోట్లు విలువైన అమెరికన్ డాలర్లు 26 కోట్ల విలువైన 88 కిలోల బంగారం, 5 కోట్ల విలువైన వజ్రాలు, బయటపడడం కలకలం రేపింది..

ఇక కల్కి భగవాన్ , ఆయన కుమారుడు రియల్ ఎస్టేట్  - నిర్మాణాలు - క్రీడారంగాల్లో పెట్టుబడులు పెట్టారని గుర్తించారు. ఇక చైనా - అమెరికా - సింగపూర్ - యూఏఈలలో కల్కి వ్యాపారాలు చేస్తున్నారని.. పన్ను ఎగవేతకు పేరొందిన దేశాల్లో పెద్ద ఎత్తున నిధులు మళ్లించి వ్యాపారాలు చేస్తున్నాడని అధికారికంగా ఐటీ అధికారులు తెలిపారు.

2014 నుంచి ఇప్పటిదాకా అధికారుల సోదాల్లో ఏకంగా 409 కోట్ల మేర అక్రమ ఆదాయం గుర్తించినట్టు ఐటీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. బయట దీని విలువ వేల కోట్లే ఉంటుందని తెలిపారు.

ఇక కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్(70) పై కేసు నమోదు చేసిన ఐటీ అధికారులు ఆ కేసులో ఆయనను ‘ఏకత్వ సిద్ధాంత గురువు’గా ప్రకటించారు.

*ఎవరీ కల్కి భగవాన్?

కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ (70). ఈయన గతంలో ఎల్ఐసీలో క్లర్క్ గా పనిచేశారు.1980లో జీవాశ్రమం పేరిట ఒక ఆశ్రమం పెట్టి పాఠశాల ప్రారంభించాడు. తర్వాత దానిని వన్ నెస్ యూనివర్సిటీ చేసి  కల్కి భగవాన్ గా ప్రకటించుకున్నాడు. తన భార్య, కుమారుడితో కలిసి ట్రస్ట్ పెట్టి ఇలా అశ్రమాలతో దందాలు చేస్తున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు.
Tags:    

Similar News