విశ్వనటుడు కమల్ హాసన్...కొద్ది రోజుల క్రితం తన రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాల్లో కమల్ కీలకమైన వ్యక్తిగా మారారు. సమకాలీన అంశాలు, అవినీతి, రాజకీయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కమల్....సందర్భానుసారంగా పళని సర్కార్ - బీజేపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ....కొద్దిరోజులక్రితం కమల్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలు చేసిన కమల్ కు వామపక్షభావాలు ఎక్కువని - ఆయన హిందూయిజానికి వ్యతిరేకి ప్రచారం జరిగింది. అయితే, తాను హిందూయిజానికి వ్యతిరేకిని కానని కమల్ క్లారిటీ ఇచ్చారు. ఆనంద వికటన్ అనే తమిళ వార పత్రికకు కమల్ రాసిన వ్యాసంలో ఆ విషయాన్ని స్పష్టం చేశారు.
తనపై వచ్చిన ఆరోపణలను కమల్ ఖండించారు. తాను హిందువులకు - హిందూయిజానికి శత్రువును కాదని - తాను ఇస్లాం - క్రైస్తవ మతాలను ఏవిధంగా చూస్తానో ....హిందూ మతాన్ని కూడా అదే విధంగా చూస్తానని చెప్పారు. తన కుటుంబ సభ్యులు హిందూ దేవతలను పూజిస్తున్నపుడు తాను హిందూ వ్యతిరేకిని ఎలా అవుతానని కమల్ ప్రశ్నించారు. తాను ఎవరికీ శత్రువును కాదని, తన వెల్ఫేర్ క్లబ్ తో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నానని, తనకు అన్ని మతాలవారు సమానమేనని కమల్ స్పష్టం చేశారు.
కాగా, ఫిబ్రవరి 21వ తేదీన తన రాజకీయ పార్టీ పేరు - విధివిధానాలు - కార్యచరణ వెల్లడించబోతున్నానని కమల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన అభిమానులకు కమల్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకొని - వారితో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికే ఫిబ్రవరి 21 నుంచి ప్రజాయాత్ర చేపడుతున్నానని కమల్ చెప్పారు. రామనాథపురంలో ఉన్న దివంగత మాజీ రాష్ట్రపతి - మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఇంటి నుంచి తన యాత్ర ను కమల్ ప్రారంభించబోతున్నారు.
కలాం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని - ప్రజాక్షేమం - అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పదవీ వ్యామోహం లేదని చెప్పారు. ప్రజాప్రతినిధుల స్వలాభం కోసం ప్రభుత్వం నడపకూడదని, తమ హక్కుల ప్రజలు ప్రశ్నించినప్పుడే పాలకులకు జవాబుదారీతనం వస్తుందన్నారు.