అన్నాడీఎంకే కు కమల్ ఆశీస్సులు దక్కుతాయా?

Update: 2017-09-16 09:38 GMT
తమిళనాడులో ప్రస్తుతం ఉన్న అన్నా డీఎంకే ప్రభుత్వం మీద సీనియర్ నటుడు కమల్ హాసన్ ఏ రేంజిలో సమరం ప్రకటించారో అందరూ చూశారు. రాష్ట్రవ్యాప్తంగా తన అభిమానులు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలంటూ బహిరంగంగానే కమల్ పిలుపు ఇచ్చారు. ప్రభుత్వంలో అవినీతి పేరుకు పోయి ఉన్నదని, దానిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని పదేపదే కమల్ వెల్లడించారు. అయితే చూసిన వారంతా ఆయన అన్నా డీఎంకే మీదనే ప్రత్యక్షపోరాటానికి ఉపక్రమిస్తున్నట్లుగా అనుకున్నారు. అయితే తాజాగా కమల్ మాటలను గమనిస్తే.. ఆయన ఆశీస్సులు కూడా అన్నాడీఎంకే దక్కబోతున్నాయని అనిపిస్తోంది.

కమల్ హాసన్ తాజాగా మాట్లాడుతూ.. పాలక పార్టీ.. శశికళను - దినకరన్ పార్టీనుంచి బహిష్కరించడాన్ని స్వాగతించారు. రాజకీయాలలో అవినీతికి తావుండరాదని - శశికళ లాంటి వారిని వెలివేయడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. సూటిగానే ఇది పళనిస్వామి ప్రభుత్వానికి కితాబులు ఇచ్చినట్లు లెక్క. అంటే పరోక్షంగా కమల్ హాసన్ తన పోరాటం.. అవినీతి మితిమీరిన శశికళ వర్గం మీదనే తప్ప.. అన్నా డీఎంకే పార్టీ మీద కానే కాదని సంకేతాలు ఇవ్వదలచుకున్నారా? అనేది ఇక్కడ గమనార్హం.

కమల్ తొలుత ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినప్పుడే.. అన్నా డీఎంకే లోని కొందరు మంత్రులు ఆయనతో ప్రెవేటుగా మాట్లాడడానికి కూడా ప్రయత్నించారు. కొందరు మంత్రులైతే.. స్పష్టంగా అవినీతిని చూపిస్తే.. వాటిని దిద్దుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కమల్ వ్యాఖ్యలకు అనుకూలంగానే ప్రకటనలు కూడా చేశారు. అంతే తప్ప.. ఏదో కమల్ కు రిటార్టు ఇవ్వడం లాగా, ఆయనను ప్రతిపక్షంగా భావించినట్లుగా.. వ్యతిరేకించడం లాగా.. పాలక కూటమిలో ఎవ్వరూ ప్రవర్తించలేదు. చూడబోతే.. శశికళను వెలివేసిన తర్వాత.. పాలక పార్టీకి కమల్ హాసన్ ఆశీస్సులు కూడా దక్కుతాయేమోనని.. అదే జరిగితే గనుక.. ఆ పార్టీకి చాలా లాభం ఒనగూరుతుందని అంచనాలు సాగుతున్నాయి. అదే సమయంలో.. అన్నా డీఎంకే పాలక పార్టీని గద్దె దించడానికి, ప్రజల్లో బద్నాం చేయడానిక మార్గాన్వేషణలో ఉన్న శశికళ వర్గానికి ప్రజల మద్దతు కూడా కమల్ వల్ల తగ్గవచ్చునని కొందరు భావిస్తున్నారు.
Tags:    

Similar News