క‌మ‌ల్‌ పై కేసు న‌మోదు చేయాల‌న్న హైకోర్టు

Update: 2017-10-25 12:29 GMT
మ‌న‌సుకు అనిపించింది చెప్ప‌టం త‌ప్పు కాదు. కానీ.. చెప్పే మాట‌ల్ని స‌మ‌ర్థంగా ఎత్తి చూపిస్తూ.. ఆ మాట‌ల వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని కోర్టుకు అర్థ‌మ‌య్యేలా ఎవ‌రు చెప్పినా.. మ‌న‌సుకు అనిపించింది చెప్పిన పెద్ద మ‌నిషికి కేసు క‌ష్టాల్లోకి చిక్కుకోవ‌టం ఖాయం. తాజాగా అలాంటి ప‌రిస్థితుల్లోనే ఇరుక్కున్నారు ప్ర‌ఖ్యాత సినీన‌టుడు.. త్వ‌ర‌లో రాజ‌కీయ పార్టీని స్టార్ట్ చేయాల‌ని భావిస్తున్న విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌.

తాజాగా ఆయ‌న సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ లో నేల‌వేము మొక్క‌ను త‌న అభిమానులు ఎవ‌రూ పంచొద్దంటూ చేసిన ట్వీట్ ఆయ‌న‌పై కేసు న‌మోదయ్యేలా చేసింది. అస‌లేం జ‌రిగిందంటే.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం డెంగీకి విరుగుడుగా నేల‌వేము మొక్క‌ను పంపిణీ చేస్తోంది. అయితే.. ప్ర‌భుత్వం మీద ఉన్న ఆగ్ర‌హ‌మో మ‌రేదైనా కార‌ణ‌మో కానీ నేల‌వేము మొక్క‌ను త‌న అభిమానులు ఎవ‌రూ పంచకూడ‌దంటూ క‌మ‌ల్ ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు.

దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన అడ్వ‌కేట్ క్ల‌ర్క్ జి.దేవ‌రాజ‌న్ మ‌ద్రాస్ హైకోర్టులో ఒక పిటిష‌న్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఎదుట‌.. పిటిష‌న్ దారు త‌న వాద‌న‌ను వినిపించారు. ఏ వైద్య ప్ర‌మాణాల ఆధారంగా నేల‌వేము మొక్క గురించి క‌మ‌ల్ హాస‌న్ ట్వీట్ చేశారో చెప్పాల‌న్నారు. నేల‌వేము మొక్క‌ను వాడ‌టంతో న‌ష్టాలు వ‌స్తాయ‌ని క‌మ‌ల్ ఏ లెక్క‌న చెప్పారో తెలియ‌జేయాల‌న్న ఆయ‌న‌.. స్వ‌త‌హాగా నేల‌వేము మొక్క‌ను వినియోగించి న‌ష్టాలు ఏమైనా ఎదుర్కొన్నారా? అన్న విష‌యాల్ని క‌మ‌ల్ చెప్పాల‌ని పిటిష‌న‌ర్ ప్ర‌శ్నించారు. స‌రైన ఆధారాలు లేకుండా ఒక మొక్క గురించి ట్వీట్ చేయ‌టం త‌ప్పని వాదించారు.

పిటిష‌న‌ర్ వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన కోర్టు.. పిటిష‌న‌ర్ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించ‌ట‌మే కాదు.. క‌మ‌ల్ హాస‌న్ పై కేసు న‌మోదు చేయాల‌ని చెన్నై న‌గ‌ర పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. మొక్కే క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే ఎంత క‌ష్టం వ‌చ్చిందో గ‌మ‌నించారు. సో.. తొంద‌ర‌ప‌డి.. ఆవేశంతో కానీ అతృత‌తో కానీ మొక్క‌ల మీద ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌కండి.
Tags:    

Similar News