అమెరికా చరిత్రలో ఎప్పుడూ జరగనిది జరగేలా చేసిన మనమ్మాయ్

Update: 2020-11-08 05:15 GMT
పేరుకు అమెరికానే కానీ.. అగ్రరాజ్యానికి సంబంధించి కొన్ని అంశాలు అంతులేని ఆశ్చర్యాన్ని నింపుతాయి. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలో.. ఇప్పటివరకు ఒక మహిళ దేశాధ్యక్షురాలు అయ్యింది లేదు. ఉపాధ్యక్షురాలు అయ్యింది లేదు. అమెరికన్లు ఏమైనా చేస్తారు కానీ తమ దేశానికి మహిళా అధ్యక్షురాలిని ఎంపిక చేసుకోవటానికి ఇష్టపడరన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఉపాధ్యక్ష పదవి విషయంలోనూ అలాంటి పరిస్థితే. అయితే.. దీన్ని ఛేదించి..చరిత్రను తిరిగరాసిన ఘనత కమలా హ్యారీస్ దే అయితే..ఆమె మూలాలు మనవే కావటం.. మనమ్మాయి కావటం భారతీయులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చే అంశం.

ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టింది మనమ్మాయే అన్న మాట మనకు మాత్రమే కాదు.. కోట్లాది మంది అమెరికన్ల మనసుల్ని దోచేయటం ఆమె ప్రత్యేకతగా చెప్పాలి. కమలా ఎదుగుదలకు కారణం ఎవరు అన్నంతనే ఆమె నోటి నుంచి వచ్చే మాట.. అమ్మ శ్యామలా గోపాలన్ హ్యారిస్.

కమలా బ్యాక్ గ్రౌండ్ కు వెళితే..

1958లో తమిళనాడులోని తిరువరూర్ జిల్లా తులసేంద్రపురం గ్రామానికి చెందిన సివిల్ సర్వెంట్ పి.వి.గోపాలన్ కుమార్తె 19 ఏళ్ల శ్యామలా గోపాలన్ హ్యారిస్.. న్యూఢిల్లీలోని లేడీ ఇర్విన్ కాలేజీలో బీఎస్సీ హోంసైన్స్ పూర్తి చేశారు. మాస్టర్స్ కోసం బెర్కిలీ లోని కాలిఫోర్నియా వర్సిటీకి అప్లై చేశారు. రిటైర్మెంట్ వయసులో తాను కూడబెట్టిన కొద్దిపాటి డబ్బును కుమార్తె ఫీజు కట్టి అమెరికాకు పంపారు. అలా అమెరికాలో అడుగు పెట్టిన కమలా తల్లి శ్యామలా హ్యారీస్.. 1962లో వర్సిటీలో జరిగిన నల్లజాతి విద్యార్థుల సమావేశంలో తన తోటి విద్యార్థి ఇచ్చిన స్పీచ్ కు ఫిదా అయ్యారు.

ఆ మీటింగ్ తో మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లింది. వారి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఆ చిన్నారే.. తాజాగా అమెరికా అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్న తొలి అమెరికన్ మహిళ కమలా హ్యారిస్. అమెరికాలో అత్యుత్తమ కేన్సర్ శాస్త్రవేత్తగా ఎదిగిన శ్యామలా.. స్టాన్ ఫర్డ్ వర్ిసటీలో ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. 1970లో భర్త డొనాల్డ్ జె.హ్యారిస్ తో విడాకులు తీసుకున్నారు. అనంతరం కాలిఫోర్నియాలోని ఓక్ లాండ్ లో నివసిస్తూ.. ఒంటరిగా ఇంటిని నడుపుతూ.. ఇద్దరు కుమార్తెల్ని చదవించి.. ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారు.

తమిళనాడులోని తన తల్లిదండ్రుల వద్దకు అప్పుడప్పుడు వచ్చే శ్యామలా 2009లో పెద్దపేగు కేన్సర్ తో మరణించారు. తనను.. తన చెల్లెల్ని అమ్మ తమిళనాడుకు తీసుకెళ్లేదని.. ఆమె చేసిన ఇడ్లీల రుచిని ఎప్పటికి మర్చిపోలేనని కమలా హ్యారీస్ ఉద్వేగానికి గురి అవుతూ చెబుతారు. కమలా భర్త డగ్లస్ ఎమ్హాఫ్. యూదు మతస్తుడైన ఆయన.. వినోదరంగ కంపెనీలకు న్యాయసలహాలు అందిస్తుంటారు. కమల విషయానికి వస్తే.. 26 ఏళ్ల వయసులో కాలిఫోర్నియా బార్ అసోసియేషన్ లో  చేరిన ఆమె.. తర్వాతి కాలంలో అలమెడా కౌంటీలో డిఫ్యూటీ డిస్ట్రిక్ అటార్నీగా నియమితులయ్యారు.

2016లో కాలిఫోర్నియాలో జరిగిన సెనెట్ ప్రాథమిక ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీలో చేరి 30 లక్షల పైచిలుకు ఓట్లతో మొదటిస్థానంలో నిలిచారు. అనంతరం సెనెట్ కు పోటీ చేసి విజయం సాధించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని రెండేళ్ల క్రితమే చెప్పిన ఆమె.. తాజాగా విజయం సాధించిన బెడైన్ తో విభేదించారు. అధ్యక్ష బరిలో నిలిచిన ఆమె.. బలంగానే ప్రయత్నించారు.

కారణాలు ఏమైనా కానీ.. అధ్యక్ష బరిలో నిలిచిన ఆమె అందుకు అవసరమైన ఓట్లను సాధించలేకపోయారు. అదే సమయంలో ప్రచారానికి అవసరమైన నిధుల్ని సమకూర్చుకోవటంలోనూ వెనుకబడ్డారు. దీంతో.. తాను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నట్లుగా 2019 డిసెంబరులో ప్రకటించారు. ఆసక్తికర అంశం ఏమంటే.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న మూడు నెలలకు కమలా హ్యారిస్ ను ఏరికోరి మరీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసినట్లుగా బైడెన్ వెల్లడించారు. మహిళలు అంటే చులకనగా చూసే ట్రంప్ నకు దిమ్మ తిరిగేలా షాకిస్తూ.. తన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
Tags:    

Similar News