హోదాతో కామినేనికి సంబంధం లేదంట

Update: 2016-08-05 08:33 GMT
నిజమే.. అధికారంలో ఉన్నప్పుడు చాలానే విషయాలు గుర్తుకు రావు. బాధ్యతలు కూడా పట్టవు. పవర్ తాలూకూ హ్యాంగోవర్ అలానే ఉంటుంది మరి. ఐదు కోట్ల మంది ఆకాంక్షలతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పేస్తున్న ఏపీ మంత్రి  కామినేని శ్రీనివాస్ మాటల్ని చూస్తే.. ఏం జరిగితే నాకేంటన్న బరితెగింపు కనిపిస్తుంది. ఓపక్క ప్రత్యేక హోదా అంశంపై హామీ ఇచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ పట్టించుకోని వైనంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ.. ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెట్టేలా.. తన ఇమేజ్ ను తానే డ్యామేజ్ చేసుకునేలా మంత్రి కామినేని వ్యాఖ్యానించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? అన్న విషయం మీద మాట్లాడే అర్హత తనకు లేదని చెప్పిన కామినేని.. అసలు హోదాతో తనకు సంబంధం ఏమిటంటూ నిలదీయటం చూసినప్పుడు అవాక్కు అవ్వాల్సిందే. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఐదేళ్లు అని మాట ఇస్తే.. కాదు పదేళ్లు అంటూ తమ పార్టీ ముఖ్యనేతలు ఇచ్చిన హామీలతో తనకు సంబంధం లేనట్లుగా కామినేని వ్యాఖ్యలు చేయటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ.. ప్రజలకు సేవ చేయటమే తన పనిగా చెబుతున్న కామినేని.. హోదా అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు చూసుకుంటారని చెబుతున్నారు. ఏపీ ప్రజల సెంటిమెంట్  అయిన హోదా అంశంపై తనకు సంబంధం లేదంటూ కామినేని వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడుతుంటే.. పలువురు సీమాంధ్రులు కామినేని వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News