జగన్ పై కన్నా లక్ష్మీనారాయణ షాకింగ్ కామెంట్స్

Update: 2019-09-10 11:49 GMT
బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్ పై పరుష వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో పూర్తిగా విఫలం అయ్యారని... ఆయన అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది, ఫ్యాక్షన్ మైండ్ సెట్ తో పాలిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. వంద రోజుల పాలన అనంతరం తాను వంద రోజుల్లో ఏం చేసింది చెప్పడం వదిలేసి... గత పాలన తప్పుల గురించి మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం అని ప్రశ్నించారు.

ఇప్పటివరకు ఒక్క నిర్మాణాత్మక మైన కార్యక్రమం చేపట్టని జగన్... ఈ వంద రోజుల్లో పాలనను తిరోగమనం వైపు నడిపించారని, ఇప్పటికే ఏపీకి కోలుకోలేని డ్యామేజ్ జరిగిపోయిందన్నారు కన్నా. అధికారంలోకి వచ్చాక వైసీపీ గర్వపడే ఒక్కపని కూడా ప్రభుత్వం చేయలేదన్నారు. వైసీపీ అధ్యక్షుడు తన మతంపై చూపిన శ్రద్ధ పాలన మీద చూపలేదన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ పర్యవేక్షణలో కాంట్రాక్టు కేటాయింపులు జరిపి కేంద్ర మంత్రి స్వీయపరిశీలనలో ఉన్న పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని కన్నా నిలదీశారు.

అంతేగాకుండా రాష్ట్ర ప్రజలు వరదల్లో చిక్కుకున్న సమయంలో జగన్ ఫ్యామిలీ టూర్లు వేయడం ఏంటని ప్రశ్నించారు. 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఘనంగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్... ఇసుక పాలసీతో, ఇతర తిరోగమన నిర్ణయాలతో లక్షలాది మందికి ఉపాధి లేకుండా చేశారని కన్నా విమర్శించారు.
Tags:    

Similar News