కాపు నేతలు ఈ రోజు బాబుకు అసలు విషయం చెప్పేస్తారా?

Update: 2019-07-01 08:42 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కాక పుట్టిస్తున్న కాపు నేతలు ఈ రోజు తమ నిర్ణయాన్ని బయటపెడతారని ఊహిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం తరువాత ఆ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగిపోయాయి. ఇదేసమయంలో టీడీపీలోని కాపు నేతలు కూడా బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. తోట త్రిమూర్తులు నేతృత్వంలో టీడీపీ కాపు నేతలంతా రహస్యంగా సమావేశమయ్యారు కూడా. ఆ సమావేశం తరువాత చంద్రబాబు వారందరితో భేటీ కావడానికి పిలిచినప్పటికీ వారెవరూ హాజరు కాలేదు. దీంతో టీడీపీ కాపు నేతలు బీజేపీలో చేరడం ఖాయమన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.

అయితే... ఇప్పటికే నమ్మకస్తులుగా భావించిన నేతలు సైతం పార్టీని వీడడంతో చంద్రబాబు మెట్టు దిగారు. కాపు నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి వారిని తనతో సమావేశానికి పిలిచారు. అందరూ రావాలంటూ వ్యక్తిగతంగా వర్తమానాలు పంపించారు. ఈ రోజు మధ్యాహ్నం ఈ భేటీ ఉంది.

అయితే.. చంద్రబాబును కలవడానికి ముందు వారంతా బోండా ఉమను కలవబోతున్నారు. బోండా ఉమ ఇంట్లో విందు తరువాత అంతా కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లనున్నారు. గుంటూరు టీడీపీ ఆఫీసులో ఈ భేటీ ఉంటుంది.

నిజానికి బోండా ఉమ కూడా చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే.. ఆయన్ను చంద్రబాబు సమర్థవంతంగా బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కాపు నేతలు - చంద్రబాబు మధ్య మధ్యవర్తిత్వం నెరుపుతున్నారని తెలుస్తోంది. కానీ.. కాపు నేతలు మాత్రం తాము బీజేపీలోకి వెళ్లబోతున్నామని చంద్రబాబుకు తెగేసి చెప్పడానికే సిద్ధమయ్యారని టాక్. 

   

Tags:    

Similar News