రాజకీయ నాయకులు.. వాస్తు.. ఓ నమ్మకం!

Update: 2023-06-25 09:43 GMT
మెజారిటీ రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు, వాస్తు నమ్మకాలు బలంగా ఉంటాయని అంటుంటారు. ఆ నమక్కంతో పాతవి కూలిపోతుంటాయి.. కొత్తవి నిర్మాణమవుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో కొత్త గుమ్మాలు వస్తుంటాయి.. పాతవి మూతపడిపోతుంటాయి. ఇదే క్రమంలో.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా విధానసౌధ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటకలో తాజాగా జరిగిన ఎన్నికల్లో 224 అసెంబ్లీ స్థానలకు గానూ 135 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ గెలుపు కర్ణాటక కాంగ్రెస్ లో మాత్రమే కాకుండా... దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చాయి. నిన్నటివరకూ మోడీకి ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న విపక్షాలు... మళ్లీ కాంగ్రెస్ వైపు కదిలాయి.

ఈ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు వ్యయం అయ్యే అయిదు ఉచిత పథకాల హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ... అధికారంలోకి వచ్చిన వెంటనే రెండింటిని ఇప్పటికే అమలుచేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సిద్ధరామయ్య కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

అవును... తాజాగా సిద్ధరామయ్య వాస్తు నిపుణులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు విధానసౌధలోని తన ఛాంబర్‌ లో మార్పులు చేర్పులు చేయించారు. ఛాంబర్‌ లోకి అడుగుపెట్టడానికి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ద్వారాన్ని మూసివేసి.. దానికి బదులుగా దక్షిణ ద్వారాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారు. గడిచిన అయిదు సంవత్సరాలుగా మూసి ఉన్న ద్వారాన్ని తాజాగా వాస్తు పూజలను నిర్వహించిన అనంతరం తెరిచారు.

అయితే ఈ విషయాలపై స్పందించిన సిద్ధరామయ్య... గత బీజేపీ ప్రభుత్వంలో వాస్తుదోషాల కారణంగా ముఖ్యమంత్రి కార్యాలయం దక్షిణ ద్వారాన్ని మూసివేశారాని.. కానీ ఈరోజు కావాలని తెరిచామని సీఎం తెలిపారు. అనంతరం... ప్రజల సంక్షేమం పట్ల శ్రద్ధ, పరిపాలనలో నిజాయితీ, కర్తవ్యం పట్ల విధేయత మనలో ఉంటే వాస్తు కూడా చిన్నబోతుందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.

Similar News