కర్ణాటకతో పాటు దేశంలో మరెక్కడ ఎన్నికలు జరిగాయి?

Update: 2023-05-11 10:07 GMT
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం విజయవంతంగా ముగిసింది. చెదురుముదురు సంఘటనలు మినహా పెద్ద ఘటనలు ఏవీ చోటు చేసుకోలేదు. ఉదయం ఏడు గంటల కు పోలింగ్ మొదలైనా.. మధ్యాహ్నం వరకు మందకొడిగానే పోలింగ్ సాగింది.

చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా భారీగా పోలీసుల వినియోగాన్ని ఎన్నికల సందర్భంగా నియమించటం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసే ఓటర్ల కంటే పోలింగ్ కు రక్షణగా నిలిచే భద్రతా సిబ్బందే అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీని పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి కూడా.

ఓట్లు వేసే వారి చేత బలవంతంగా ఓట్లు వేయించుకునేలా భద్రతా దళాల్ని వినియోగించిన్నట్లుగా బీజేపీయేతర నేతలు వ్యాఖ్యానించారు. మొత్తంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 72 శాతంగా వెల్లడైంది. మొత్తం 224 స్థానాల కు జరిగిన ఎన్నికల్లో ఒక్క గ్రామంలోనే కోపంతో ప్రజలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. కానీ.. అవి అదనంగా తీసుకొచ్చిన ఈవీఎంలుగా అధికారులు గుర్తించారు.

ఇక.. కర్ణాటకలో అత్యధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గంగా పాత మైసూర్ లోని రామనగర స్థానంగా నిలిచింది. ఇక్కడ 78.22 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. అతి తక్కువ పోలింగ్ బెంగళూరు నగరంలోని దక్షిణ నియోజకవర్గంగా నిలిచింది. ఇక్కడ కేవలం 48.63శాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

కర్ణాటక వ్యాప్తంగా ఏ పోలింగ్ కేంద్రంలోనూ రీపోల్ అవసరం ఏర్పడలేదని ఈసీ పేర్కొంది. బెళగావి జిల్లాలోని యరగట్టి ప్రాంతంలో ఓటు వేసేందుకు వెళ్లిన 70 ఏళ్ల పారవ్వ ఈశ్వర సిద్నాలా అనే పెద్ద వయస్కురాలు బూత్ లోపల ఓటు వేయటానికి ముందు ప్రాణాలు విడిచారు. హసన్ జిల్లాలో 49 ఏళ్ల జయన్న ఓటు వేసి బయటకు వస్తూ పోలింగ్ కేంద్రం లోనే ప్రాణాలు విడిచారు. ఈ రెండు ఉదంతాలు షాకింగ్ గా మార్చాయి.

కర్ణాటకతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. పంజాబ్ లోని జలంధర్ లోక్ సభ స్థానానికి.. ఉత్తరప్రదేశ్ లోని రెండు.. మేఘాలయ.. ఒడిశాలల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉఫ ఎన్నికలు జరిగాయి. మేఘాలయ లోని సొహియాంగ్ అసెంబ్లీ స్థానంలో రికార్డు స్థాయిలో 91.8శాతం పోలింగ్ నమోదైంది. ఒడిశాలో పోలింగ్ 68 శాతం నమోదైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాల ఓట్ల లెక్కింపు శనివారం (మే 13న) ఉదయం షురూ కానుంది.

Similar News