హిజాబ్ స‌రే.. బొట్టు, గాజులు, శిలువ సంగ‌తేంటి? .. క‌ర్ణాట‌క హైకోర్టులో వాద‌న‌ల వేడి!

Update: 2022-02-17 01:30 GMT
క‌ర్ణాట‌క‌ను కొన్ని నెల‌లుగా కుదిపేస్తున్న `హిజాబ్‌` అంశంపై ఇంకా వేడి కొన‌సాగుతూనే ఉంది. ఈ వివాదంతో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఇరుకున ప‌డిన విష‌యం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో అల్ల‌ర్లు.. లాఠీచార్జీల‌కు కూడా దారితీసింది. ఇక‌, చివ‌ర‌కు ఇది.. న్యాయ‌వ్య‌వ‌స్థ వద్ద‌కు చేరింది.

దీనిని విచారించేందుకు సుప్రీం కోర్టు విముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతో.. క‌ర్ణాట‌క హైకోర్టులోని న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన బెంచ్ విచారిస్తోంది. తాజాగా దీనిపై జ‌రిగిన వాద‌న‌లు వాడి వేడిగా సాగాయి. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ వాదనలు వింది.

హిజాబ్ వివాదంపై ముస్లిం బాలికల తరపు న్యాయవాది రవి కుమార్ కోర్టు ముందు వినిపించారు. దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయని, మతాలకు అనుగుణంగా ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయని, మరి అలాంటప్పుడు ఒక్క ముస్లిం విద్యార్థులకే ఎందుకు నిబంధనలు అమలు చేస్తున్నారని రవి కుమార్ ప్రశ్నించారు.

''సిక్కులు టర్బన్‌లు ధరిస్తారు. హిందువుల్లోనే కొందరు దుపట్టా వేసుకుంటారు. వీళ్లెవరినీ విద్యాసంస్థల్లోకి అనుమతి లేదని చెప్పలేదు. కానీ ఒక్క హిజాబ్ ధరించిన వారిని మాత్రమే విద్యా సంస్థల్లోకి అనుమతించలేదు.

మన దేశంలో ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవిస్తారని, ఈ వైవిధ్యం గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఈ ప్రభుత్వం కేవలం ముస్లిం బాలికలపైనే ఎందుకు ఈ వివక్ష చూపిస్తోంది?. హిజాబ్ మతపరమైన సంప్రదాయం కాదా? పేద ముస్లిం బాలికల హిజాబ్‌లు ఎందుకు తొలగిస్తున్నారు?'' అని కోర్టులో న్యాయవాది రవి కుమార్ వాదించారు.

'బొట్టు పెట్టుకున్న విద్యార్థిని బయటికి పంపలేదు. గాజులు వేసుకున్న విద్యార్థిని బయటికి పంపలేదు. సిలువ ధరించిన విద్యార్థిని బయటికి పంపలేదు.

 కానీ హిజాబ్ ధరించిన విద్యార్థినిని మాత్రమే ఎందుకు బయటికి పంపారు? ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్-15కు వ్యతిరేకం. గూంగట్స్‌కు అనుమతి ఉన్నప్పుడు, గాజులకు అనుమతి ఉన్నప్పుడు, టర్బన్‌లకు అనుమతి ఉన్నప్పుడు, హిజాబ్‌కు ఎందుకు అనుమతి లేదు? మతం ఆధారంగా పక్షపాతం చూపిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తరగతి గది నుంచి బయటికి పంపించారు'' అని కర్ణాటక హైకోర్టు ముందు న్యాయవాది రవి కుమార్ వాదనలు వినిపించారు. దీనిపై వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి.

హిజాబ్‌పై కొన‌సాగుతున్న వివాదాలు..

మ‌రోవైపు.. హిజాబ్‌ వివాదం నేపథ్యంలో కర్ణాటకలో వారం రోజులుగా మూతపడిన ప్రీయూనివర్సిటీ డిగ్రీ కళాశాలల బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కళాశాలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం మతపరమైన దుస్తులను కళాశాలలోనికి అనుమతించేది లేదంటూ సిబ్బంది కళాశాలల వద్ద విద్యార్థినులను అడ్డుకున్నారు.

హిజాబ్‌తోనే తమను తరగతులకు అనుమతించాలంటూ శివమొగ్గలోని సగర ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల వద్ద విద్యార్థినులు సిబ్బందితో వాదించారు. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది. డీవీఎస్ కళాశాల వద్ద విద్యార్థినులను బూర్ఖా తొలగించి లోనికి రావాలని సిబ్బంది కోరారు.

వారికోసం గేటు లోపల ప్రత్యేకంగా ఓ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల కంటే తమ విశ్వాసం ముఖ్యమని బూర్ఖా తొలగించే సమస్యే లేదని విద్యార్థినులు తేల్చిచెప్పారు. ఈ రోజు పరీక్ష ఉన్నప్పటికీ తమను తరగతులకు అనుమతించడం లేదని అన్నారు.
Tags:    

Similar News