ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!

Update: 2019-07-25 15:23 GMT
కర్ణాటక రాజకీయాల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలకు గానూ ముగ్గురిపై అనర్హత వేటు పడింది. ఈమేరకు కర్ణాటకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితపై మాట్లాడేందుకు స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ అత్యవసర ప్రెస్‌ మీట్‌ కు పిలుపునిచ్చారు. ఈమేరకు విధానసౌధలోని తన చాంబర్‌లో గురువారం రాత్రి గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురిని అనర్హులుగా ప్రకటించారు.

గోకాక్‌ ఎమ్మెల్యే రమేశ్‌ జార్కిహోళి - అథణి ఎమ్మెల్యే మహేశ్‌ కుమటళ్లి - రాణిబెన్నూరు ఎమ్మెల్యే ఆర్‌.శంకర్‌ ను అనర్హులుగా చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే 2023 మే వరకు వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా పేర్కొన్నారు. కాగా ఆర్‌.శంకర్‌ సొంతంగా పార్టీ స్థాపించి విజయం సాధించారు. అయితే అనంతరం కేబినెట్‌ లో బెర్తు ఖరారు కాగానే కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ)ని కాంగ్రెస్‌ లో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్‌ నుంచి ఆయనకు అనర్హత వేటు వేశారు. రాజీనామా విషయమై చర్చించేందుకు పలుమార్లు నోటీసులు పంపించినా హాజరు కాలేదని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు.

ఇటీవల కాలంలో తనకు మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు సమర్పించినట్లు స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. అయితే కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై అనర్హత వేటు వేస్తున్నట్లు పేర్కొన్నారు. హావేరి జిల్లా రాణిబెన్నూరు నుంచి కేపీజేపీ నుంచి గెలిచిన ఆర్‌.శంకర్‌ గత జూన్‌ లో మంత్రివర్గంలో చోటు లభించగానే సిద్ధరామయ్యతో కలిసి వచ్చి కేపీజేపీని కాంగ్రెస్‌ లో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈనెల 8వ తేదీన బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఆర్‌.శంకర్‌ గవర్నర్‌ కు లేఖ రాసి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు ఆర్‌.శంకర్‌ పై 2023 మే నెల వరకు అనర్హత వేటు వేసినట్లు స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. మరో నాలుగేళ్ల పాటు ఆర్‌.శంకర్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు.

అదేవిధంగా గత ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రమేశ్‌ జార్కిహోళి (గోకాక్‌) - మహేశ్‌ కుమటళ్లి (అథణి) - ఉమేశ్‌ జాదవ్‌ (చించోళి) - బి.నాగేంద్ర (బళ్లారి రూరల్‌) పై అనర్హత వేటు వేయాలని సీఎల్పీ నేత సిద్ధరామయ్య - కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు ఫిర్యాదు చేసినట్లు స్పీకర్‌ తెలిపారు. అయితే చించోళి ఎమ్మెల్యే రాజీనామా సమర్పించి బీజేపీలో చేరారు. అదేవిధంగా బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే బి.నాగేంద్రపై పార్టీ పెద్దలే అనర్హత ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. ఈనేపథ్యంలో జాబితా నుంచి వారి పేర్లను తొలగించినట్లు తెలిపారు. కాగా గోకాక్‌ ఎమ్మెల్యే రమేశ్‌ జార్కిహోళి - అథణి ఎమ్మెల్యే మహేశ్‌ కుమటళ్లిపై కూడా మరో నాలుగేళ్ల పాటు అనర్హత వేటు వేస్తున్నట్లు స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ వివరించారు.
Tags:    

Similar News