లంచం తీసుకోలేద‌ని వెంటాడి కాల్చేశాడు

Update: 2018-05-04 10:44 GMT
దారుణ‌మైన ఘ‌ట‌న ఒక‌టి  హిమాచల్ ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. నిజాయితీగా ఉండ‌టం ఒక మ‌హిళా అధికారి నిండు ప్రాణాలు పోయేలా చేసింది. లంచం ఇస్తామంటే వ‌ద్ద‌న్నార‌న్న ఆగ్ర‌హంతో వెంటాడి మ‌రీ కిరాత‌కంగా కాల్చేసిన వైనం ఇప్పుడా రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. ఇంత దారుణం ఎలా చోటు చేసుకుందంటే..

అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్ర‌కారం.. ఎలాంటి మిన‌హాయింపులు లేకుండా క‌సౌలీ ప‌ట్ట‌ణంలో అక్ర‌మ క‌ట్ట‌డాల్ని కూల్చేయాల‌ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం డిసైడ్ అయ్యింది. పోలీసుల సాయంతో రూల్స్ ను బ్రేక్ చేసిన క‌ట్ట‌డాల్ని కూల్చేయ‌టం షురూ చేశారు. ఇందులో భాగంగా హోట‌ళ్ల‌ను కూల్చేయ‌టం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో మండో మాట్కండ‌లో ఉన్న నార‌య‌ణి గెస్ట్ హౌస్ ను కూల్చేందుకు అధికారులు ప్ర‌య‌త్నించారు. దీనికి గెస్ట్ హౌస్ య‌జ‌మానికి.. అధికారిణి ష‌హిల్ బాల‌శ‌ర్మ‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆగ్ర‌హంతో వాదిస్తూనే.. మ‌రోవైపు బ్ర‌తిమిలాడిన గెస్ట్ హౌస్ య‌జ‌మాని.. ఒక‌ద‌శ‌లో హెచ్చ‌రిక‌ల‌కు దిగాడు. తాను చెప్పిన‌ట్లుగా వింటే అధికారిణికి లంచం ఇస్తాన‌ని కూడా ఆశ చూపాడు. అయితే.. వేటికి స‌ద‌రు అధికారిణి లొంగ‌లేదు. దీంతో.. తీవ్ర ఆగ్ర‌హానికి గురై.. అధికారిణిపై దాడి చేసేందుకు వెంటాడాడు. తన ద‌గ్గ‌రున్న తుపాకీతో మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. నిజ‌యితీగా ఉండాల‌ని.. నీతిగా బ‌త‌కాల‌ని చివ‌రిదాకా పోరాడిన అధికారిణి తుదిశ్వాస విడిచారు.అధికారిణిపై కాల్పుల అనంత‌రం ద‌గ్గ‌ర్లోని అడ‌వుల్లోకి పారిపోయాడు నిందితుడు.

ఈ ఉదంతం తీవ్ర సంచ‌ల‌నంగా మ‌రింది. నిందితుడి కోసం గాలింపులు జ‌రిపిన పోలీసులు చివ‌ర‌కు యూపీలో అతడ్ని ప‌ట్టుకున్నారు. మొబైల్ సిగ్న‌ల్స్ ఆధారంగా ఆత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న స‌మ‌యంలో నిందితుడు త‌న నేరాన్ని ఒప్పుకున్నాడు. లంచం ఇస్తాన‌ని చెప్పినా విన‌లేద‌ని.. త‌మ ఆస్తిని కూల్చేయొద్ద‌ని త‌న త‌ల్లి బ్ర‌తిమిలాడింద‌ని అయినా అధికారిణి విన‌లేద‌న్నాడు. త‌న త‌ల్లి కాళ్ల మీద ప‌డినా క‌నిక‌రించ‌క‌పోయేస‌రికి తాను కాల్చిన‌ట్లు చెప్పుకున్నాడు. త‌ప్పు చేసి.. కాళ్ల మీద ప‌డితే కరిగిపోవాలి క‌దా.. రూల్స్ బ్రేక్ చేసినా ఏమీ అన‌కూడ‌ద‌న్న‌ట్లుగా ఉన్న నిందితుడి మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

Tags:    

Similar News