భారత్ కు పోటీగా పాకిస్థాన్ ను తయారు చేయాలని.. ఆ దేశానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న దేశం చైనా. పాకిస్థాన్ కు అణు పరిజ్ఞానం, లేటెస్ట్ టెక్నాలజీ అందిస్తూ ఆ దేశానికి మిత్ర దేశంగా వెలుగొందుతోంది. అతి స్వల్ప వడ్డీకే కోట్లాది రూపాయల డాలర్లు ఇస్తూ ఆ దేశ ఆర్థికాభివృద్ధికి సాయపడుతోంది. అలాంటి దేశం ఒక్కసారిగా పాకిస్థాన్ కు దిమ్మతిరిగేలా షాకిచ్చింది.
కశ్మీర్ రెండు దేశాలకు సంబంధించిన అంశమని అందులో తాము జోక్యం చేసుకునేది ఏమీ లేదని చైనా తేల్చిచెప్పడం గమనార్హం. కశ్మీరుపై ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అమలు చేయాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడుతూ చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో ధూర్త దేశంగా ముద్రపడ్డ ఉత్తర కొరియా, పాకిస్థాన్ కు చైనానే అణ్వాయుధ పరిజ్ఞానం, క్షిపణి టెక్నాలజీ అందిస్తోందని అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు అనుమానిస్తున్నాయి. పాకిస్థాన్ ను భారత్‌కు, ఉత్తర కొరియాను అమెరికా పక్కలో బల్లెంలా తయారు చేస్తూ పబ్బం గడుపుకుంటోందని ఆ దేశాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా తనకు వస్తున్న చెడ్డ పేరును తొలగించుకునేందుకు చైనా కృతనిశ్చయంతో ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కశ్మీర్ అంశంలో మాకు సంబంధం లేదని పాక్ - భారత్ లే చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని తాజా వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
చైనా నిర్ణయంతో పాకిస్థాన్ కు దిమ్మతిరిగింది. వివిధ అంతర్జాతీయ వేదికలతోపాటు ఐక్యరాజ్యసమితి వంటివాటిల్లో కశ్మీర్ సమస్యను లేవనెత్తుతూ భారత్‌ను ఇరుకునపెడుతోంది పాక్. అయితే చైనా తాజా నిర్ణయంతో పాక్ ఇక అలాంటి పనులు చేయబోదని ఆశించొచ్చు. తన మిత్ర దేశం మద్దతే లేనప్పుడు వేరే ఏ దేశం కూడా పాక్ కు సహాయం చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు మానుకోవాలని ప్రతి సందర్భంలోనూ హెచ్చరిస్తుండటం గమనార్హం.