పెనుసంచలనం: వైరల్ గా కశ్మీర్ ఉగ్రవాది ఆడియో క్లిప్

Update: 2020-12-29 05:16 GMT
ఎన్ కౌంటర్ కు అడుగు దూరంలో ఉన్న వేళ.. చావు తప్పించి మరో మార్గం ఏదీ కనిపించని సందర్భంలో జమ్ముకశ్మీర్ కు చెందిన ఒక యువ ఉగ్రవాది తన తండ్రికి ఫోన్ చేశాడు. తాను దిద్దుకోలేని తప్పు చేసినట్లుగా వేదన చెందటమే కాదు.. భారత భద్రతా దళాలు తమను లొంగిపొమ్మని అవకాశం ఇచ్చినా.. లొంగిపోలేని స్థితిలో ఉన్నామని.. పెద్ద తప్పు చేశానని వాపోయాడు.

కశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని క్రీరి పట్టణ శివారులో కొద్దిరోజుల క్రితం ఈ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో సదరు ఉగ్రవాదితీవ్ర గాయాలైనట్లుగాతేలింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫుట్ బాల్ ప్లేయర్ అయిన ఆ యువకుడు చెడు మార్గాన పట్టి.. తనజీవితాన్ని ఎంతలా నాశనం చేసుకున్నది తన తండ్రితో సాగిన సంభాషణలో వెల్లడించాడు.

అంతేకాదు.. ఒకవేళ తాను లొంగిపోతే.. ఉగ్రవాదులు కుటుంబ సభ్యుల్ని అస్సలు విడిచిపెట్టరని..తాను తన జీవితాన్ని నాశనం చేసుకున్నానని వాపోయాడు. పాక్ ఉగ్రవాదులు కశ్మీరీ యువకుల్ని ఎలా ట్రాప్ చేసేది.. వారు వెనక్కి రాలేని రీతిలో ఎలా బుక్ చేసేది వివరంగా చెప్పుకొచ్చాడు. తాను చిక్కుకున్న ఉక్కు తీగల గూట్లో నుంచి బయటపడదామని భావించినా.. వెనక్కి రాలేమంటూ వేదన చెందాడు.

తాను చేసిన తప్పును మరెవరూచేయకూడదనే తాను ఫోన్ చేసినట్లుగా చెప్పాడు. తమ్ముడ్ని.. స్నేహితుల్ని ఈ దారిలోకి రావొద్దంటూ వేదన చెందిన ఫోన్ కాల్ కు సంబంధించిన సంచలన ఆడియో క్లిప్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దీన్ని ఒక ప్రముఖ టీవీ చానల్ ప్రసారం చేసింది. ఆ ఫోన్ కాల్ లో సంభాషణ ఎలా సాగిందంటే..

యువకుడు (ఉగ్రవాది): నాన్నా నేను ఆమిర్. మీరు బావున్నారా..?
తండ్రి: హా.. బేటా.. నువ్ ఎక్కడ ఉన్నావ్?

యువ ఉగ్రవాది : మేం దొరికిపోయాం. నాతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మేం సరెండర్ అవుదామనుకున్నాం. కానీ.. మాకు మరో మార్గం లేదు. వాళ్లు అందరినీ చంపేస్తారు. సరెండర్ అనే ఆలోచన వస్తేనే అందరినీ చంపేస్తామని చెప్పారు.

తండ్రి: అయ్యో బేటా.. బయటపడే మార్గమే లేదా?

యువ ఉగ్రవాది : లేదు. నేను తప్పు చేశా. వాళ్ల మాటలు విని ప్రభావితమయ్యా . వాళ్లు నన్ను తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లారు. బలవంతంగా నా చేతిలో ఆయుధం పెట్టి ఫోటో తీశారు. అది వైరల్ అయ్యేలా చేసి.. ఆర్మీ దృష్టిలో పడేలా చేశారు. ఇంటికి తిరిగొచ్చేద్దామనుకున్నా. కానీ.. అలా చేస్తే వాళ్లు మన ఇంట్లో వారందరిని చంపేస్తారు.

తండ్రి: నువ్ లేకుండా మేం ఎలా బతకాలి?

యువ ఉగ్రవాది: నాన్నా. మీరు అలా మాట్లాడొద్దు. నేను ఇలా చెప్పానని ఎవరితో చెప్పొద్దు. నా ప్రాణాలు పోయేలోపు మీకు నిజం చెప్పాలని ఫోన్ చేశా. నేను తప్పు చేశా. నాకేం తెలియదు. నేను ఇటు వైపు ఎలా వచ్చానో కూడా అర్థం కావట్లేదు. ఇది నాకొక పాఠం. నా తమ్ముడికి, స్నేహితులకు చెప్పండి.. ఇది చాలా భయంకరమైన మార్గం. ఇటు వైపు రావాలనే ఆలోచనే చేయొద్దని చెప్పండి. కెరీర్ మీద దృష్టి పెట్టి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని చెప్పండి.

తండ్రి: నువ్ లేకుండా నీ చెల్లి, నీ తల్లి ఎలా ఉండగలుగుతుంది? వాళ్లకు ఏం చెప్పాలి?

యువ ఉగ్రవాది : అందరికీ అదే చెప్పండి. నేను ఎంచుకున్న మార్గానికి భవిష్యత్తు లేదు. బయటపడటానికి ఎలాంటి మార్గం లేదు. నేను నా జీవితాన్ని వృథా చేశాను. ఇప్పుడు తిరిగి వద్దామనుకున్నా రాలేని పరిస్థితుల్లో ఉన్నా. నేను ఇప్పుడు చేయగలిగిందల్లా ఒక్కటే.. నా తమ్ముడు, స్నేహితులు ఈ దారిలోకి రాకుండా చూడటం. అందుకే మీకు ఫోన్ చేశా.

ఇండియన్ ఆర్మీ, కశ్మీర్ పోలీసులు నాకు లొంగిపోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ, లొంగిపోలేను. అలా చేస్తే అందరినీ చంపేస్తారు. నేను మృత్యువు నుంచి బయటపడలేను.నావాళ్ల కోసం కష్టపడి పని చేయాలనుకుంటున్నా. కానీ.. నాకు ఆ అవకాశం లేదు. ఇదంతా నా తలరాత.మరెవరూ నాలాగా కాకూడదన్నదే నా కోరిక.
Tags:    

Similar News