కౌశిక్ రెడ్డి పదవికి అడ్డం పడుతున్న కేసులు..

Update: 2021-08-19 10:30 GMT
ఎన్నో ఆశలతో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి భవితవ్యం ఇప్పుడు డోలాయమానంలో పడింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వెలుగులోకి వచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి భర్తరఫ్ కాబడ్డ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కౌశిక్ రెడ్డి కూడా ఈటల రాజేందర్ పై అనేక ఆరోపణలు చేశారు. ఆ తరువాత టీఆర్ఎస్ తరుపున పోటీ చేసేందుకు టికెట్ ఆశించి టీఆర్ఎస్లో చేరారు. అయితే వెంటనే ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం పొందడంతో ఆయనకు టికెట్ ఇవ్వరని తెలిసింది. ఆ తరువాత గెల్లు శ్రీనివాస్ పేరు ఖరారు చేయడంతో కౌశిక్ రెడ్డి పోటీలో లేడని నిర్దారణ అయింది. అయితే గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపినా.. ఆయనపై ఉన్న కేసులతో గవర్నర్ ఫైల్ పై సంతకం చేస్తారా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి రెండో స్థానంలో ఓడిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్లోనే కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కౌశిక్ రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి రావడానికి ఇవి అడ్డం పడుతున్నట్లు తెలుస్తోంది. తనకు హుజూరాబాద్ టికెట్ రాకున్నా, ఎమ్మెల్సీ పదవి వస్తుందనే సంబరంతో ఉన్న కౌశిక్ రెడ్డికి కేసుల విషయంలో మాత్రం ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయిని చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా కొనసాగుతున్న కౌశిక్ రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. 2018లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన ఆయనపై ఇల్లందకుంట, సుబేదారి పోలీస్ స్టేషన్లలలో కేసులు నమోదయ్యాయి. అలాగే కరీంనగర్, జమ్మికుంట, వీణవంక, సిరిసిల్ల, హుజూరాబాద్ లలోనూ ఆయనపై కేసులు ఉన్నాయి. సినీ నటుడు జీవిత రాజశేఖర్ పార్కింగ్ విషయంతో తమతో గొడవ పడినందుకు కౌశిక్ రెడ్డిపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక తెలంగాణ పోరాటంలో మానుకోట వద్ద ఉద్యమ కారులపై రాళ్లు రువ్వారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలు, వాటికి కారణాలను పరిశీలించాలని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఈ కేసులకు సంబంధించిన వివరాలు, కేబినేట్ తీర్మానాన్ని గవర్నర్ కు పంపాలని ప్రభుత్వం చూస్తోంది.

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి వీడిపోయిన తరువాత కౌశిక్ రెడ్డి తనకే టికెట్ వస్తుందని భావించారు. దీంతో కొన్ని రోజుల పాటు వేచిచూసిన ఆయన తన అనుచర వర్గంతో భారీ ఎత్తున సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అయితే పార్టీలో చేరిన సమయంలో కేసీఆర్ టికెట్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ తరువాత కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆయనకు జాక్ పాట్ తగిలినట్లయింది. దీంతో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్న తరుణంలో కేసుల విషయం బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది.

క్రికెట్ క్రీడాకారుడిగా ఉన్న కౌశిక్ రెడ్డికి పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే ముఖ్య నాయకుడిగా ఎదిగారు. తన తల్లి ‘పుష్పమాల దేవి మెమోరియల్ ట్రస్టు’ పేరిట కరీంనగర్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి కేటాయించడం అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో వాటికి సంబంధించిన నివేదిక తయారు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించింది.




Tags:    

Similar News