భాగ్యనగరం పై కన్నేసిన కవిత... ఈసారి అసెంబ్లీకి!

Update: 2023-06-02 10:00 GMT
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలూ, వ్యూహ ప్రతివ్యూహాలూ రోజు రోజుకీ మారిపోతున్నాయి. ఇందులో భాగంగా... ఈసారి ఎలాగైన గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే కసిమీదున్న బీఆరెస్స్ పెద్దలు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా... ఈసారి బీఆరెస్స్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తే కవితను అసెంబ్లీకి పంపాలని ఫిక్సయ్యారని సమాచారం.

గతంలో నిజామాబాద్ ఎంపీగా, అనంతరం 2019 ఎన్నికల ఫలితాల అనంతరం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కల్వకుంట్ల కవిత... ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈమె భాగ్యనగరంపై దృష్టి పెట్టారని.. గ్రేటర్ పరిధిలోనే ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారని సమాచారం.

రాష్ట్రంలో బీఆరెస్స్ హ్యాట్రిక్ కొట్టి, మరోసారి అధికారంలోకి వస్తే.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల కంటే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని.. రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవిని చేపట్టాలని కవిత బలంగా భావిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... హైదరాబాద్‌ లోని ముషీరాబాద్ అసెంబ్లీ స్థానంపై కవిత కన్నేసినట్లు కథనాలొస్తున్నాయి.

ప్రస్తుతం బీఆరెస్స్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్థానంలోనే కవిత పోటీ చేయాలని భావిస్తున్నారంట. ఈ విషయంలో ఇప్పటికే గోపాల్ తో మాట్లాడిన కేసీఅర్... ఈ మేరకు ఆయనకు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. తన రాజకీయ భవిష్యత్తును తాను చూసుకుంటాని, ఆ విషయం తనకు వదిలేయమని హామీ ఇచ్చిన సీఎం... ఈ మేరకు ముషీరాబాద్ సీటును తన కుమార్తె కవిత కోసం త్యాగం చేయాలని సూచించినట్లు సమాచారం.

అయితే ఈ సూచనకు గోపాల్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పైగా అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో వ్యక్తులు గెలవడం కంటే పార్టీ గెలుపు ముఖ్యం అని భావించారో... లేక, ఇప్పటికే ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతుండటం వల్ల రిస్క్ ఎందుకని అనుకున్నారో తెలియదు కానీ.. ఈ మేరకు కేసీఆర్ ప్రతిపాదనను అంగీకరించారని తెలుస్తుంది. పైగా... ఈ నియోజకవర్గంలో సర్వేలు బీఆరెస్స్ కు కాస్త వ్యతిరేకంగా, బీజేపీకి కాస్త అనుకూలంగా వస్తున్నాయి.

దీంతో ఈసారి ముఠా గోపాల్ కంటే కవిత అయితేనే ఇక్కడ గెలవడం కాస్త సులువు అవుతుందని.. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న ముస్లింల ఓట్లను కవిత అయితే బాగా ఆకర్షించగలదని పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయంట. పైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పై మళ్లీ పట్టు సాధించాలంటే భాగ్యనగరంలో పార్టీకి బలమైన స్థానిక నాయకత్వం అవసరం అని కేసీఆర్ బలంగా నమ్మడం కూడా ఈ నిర్ణయం వెనకున్న మరో కారణం అని తెలుస్తుంది.

అయితే గ్రేటర్ పరిధిలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలంటే.. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎవరొకరు ఇక్కడ పోటీచేయాలని కేసీఆర్ మొదటినుంచీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా మొదట కేటీఆర్ ను కూకట్‌ పల్లి లేదా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి దింపాలని కేసీఆర్ ప్రతిపాదించారు. అయితే ఈ నియోజకవర్గంలో జరిపిన సర్వేల్లో ఫలితాలు బీఆరెస్స్ కు అంత అనుకూలంగా లేవని తేలండంతో... ఆ ఆలోచనను కేసీఆర్ విరమించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాస్త సేఫ్ జోన్ అయిన ముషీరాబాద్ నుంచి కవితను పోటీకి దింపాలని కేసీఆర్ ఆలోచించారంట!

మరి ఈసారి గ్రేటర్ నుంచి పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్న కవిత కోరిక, కేసీఆర్ వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి!

Similar News