ఈసారి వారిద్దరి మధ్య ‘పావుగంట’ ఏకాంతం

Update: 2015-12-30 05:14 GMT
మరోసారి చంద్రుళ్లు ఇద్దరు కలిశారు. ఉప్పునిప్పులా వ్యవహరిస్తూ.. పోటాపోటీగా ఎత్తులు.. పైఎత్తులు వేసుకున్న వారిద్దరూ ఇప్పుడు ఎదురుపడే అవకాశం వస్తే వదులుకోవటం లేదు. ఎదురుపడినప్పుడు ఇద్దరూ ఆత్మీయంగా పలుకరించుకుంటున్నారు. ఆపై ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. దసరా సందర్భంగా ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముందున్న పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడు వాతావరణం కూల్ కూల్ గా మారిపోయింది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మొదలైన పిలుపుల నాటి నుంచి అంతా సజావుగా సాగుతోంది.

శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ఇంటికి వచ్చిన బాబును కేసీఆర్ సాదరంగా ఆహ్వానించటం.. ఆపై ఆయనతో గంటకు కాస్త అటూ ఇటూగా ఏకాంతంగా మాట్లాడితే.. ఈ మధ్యన అయుత చండీయాగానికి ఆహ్వానించేందుకు ఏపీకి వెళ్లిన కేసీఆర్.. చంద్రబాబు నివాసంలో ఏకాంతంగా భేటీ అయ్యారు. వీరి మధ్య ఏకాంత భేటీల్లో ఏ విషయాలు చర్చకు వస్తున్నాయన్న విషయంపై ఎవరూ ఎలాంటి అంచనాలకు రాలేకున్నారు.

ఇదిలా ఉంటే..తాజాగా గవర్నర్ అధికార నివాసంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఇద్దరు చంద్రుళ్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు చంద్రుళ్లలో తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరైతే..  ఆ తర్వాత కాసేపటికి ఎపీ సీఎం చంద్రబాబు వచ్చారు. నిజానికి చంద్రబాబు దగ్గరక కేసీఆర్ వచ్చి పలుకరించటం.. అందుకు బాబు స్పందించటం జరిగిపోయాయి.

ఇద్దరు చంద్రుళ్లు పక్కపక్కనే నిలుచొని మాట్లాడుకోవటం.. కలిసి పలువురిని పలుకరించటం లాంటి సన్నివేశాలు ఈ విందులో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇక.. గవర్నర్ మనవరాళ్లతో రాష్ట్రపతి.. ఇద్దరు చంద్రుళ్లతో ఫోటోలు దిగిన సందర్భంలోనూ.. చంద్రబాబు.. కేసీఆర్ లు పక్కనే నిలుచొని ఫోజులు ఇవ్వటం గమనార్హం. ఇక.. ఈ విందు సమావేశంలో ఓపక్కకు వెళ్లిన ఇద్దరు చంద్రుళ్లు పావు గంట పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. కలిసిన ప్రతిసారీ.. దాదాపుగా ఏకాంతంగా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవటం ఆసక్తికరమైన అంశంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News