ఈసారి చంద్రుళ్లలో డుమ్మా కొట్టేదెవరు?

Update: 2015-07-08 10:17 GMT
ఉప్పు..నిప్పులా ఉంటూ.. నిత్యం ఏదో ఒక పంచాయితీ లేనిదే తెల్లారనట్లుగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల వ్యవహారం. నిత్యం తిట్టుకొని.. పోట్లాడుకొని.. న్యాయపోరాటాలు అంటూ కోర్టుల చుట్టూ తిరిగే కన్నా.. ఇష్యూలన్నింటికి ఒక అజెండాగా మార్చి.. ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రోజులుగా వరుసగా కూర్చొని పట్టువిడుపులతో వ్యవహరిస్తే తెలుగువారికి అంతకు మించి కావాల్సిందేముంది?

ఇద్దరు అధినేతలు కలిసి కూర్చొని సమస్యల మీద చర్చలు జరిగే కంటే ముందు.. కనీసం ముఖాముఖిన ఎదురు పడేందుకు కూడా ఇష్టపడని రకంగా మారటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసేందుకు అవకాశం ఉన్న వేదికలకు ఎవరో ఒకరు హాజరు కాకుండా ఉంటున్న పరిస్థితి.

మొన్నామధ్య రాష్ట్రపతి ప్రణబ్‌ గౌరవార్థం గవర్నర్‌ ఇచ్చిన విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరు కావాల్సి ఉంది. అయితే.. తనకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. విందుకు గైర్హాజరు అయ్యారు.

మంగళవారం రాష్ట్రపతి విందు ఇచ్చారు. దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందినప్పటికీ.. జపాన్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబు విందుకు వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల పదిన గవర్నర్‌ నరసింహన్‌ ఇఫ్తార్‌ విందు ఇస్తున్నారు. దీనికి ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఆయన ఆహ్వానించారు. మరి.. ఈ విందులో అయినా ఇద్దరు కలుస్తారా? లేక.. వ్యూహాత్మకం ఇద్దరిలో ఎవరు డుమ్మా కొడతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News