ఇద్దరు చంద్రుళ్లలో సుద్దపూస ఎవరు?

Update: 2015-06-09 11:30 GMT
సుదీర్ఘకాలం సాగిన తెలంగాణ సెంటిమెంట్‌ తర్వాత మరో సెంటిమెంట్‌ అంశం తెర పైకి వచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే దశాబ్దాల తరబడి సాగిన తెలంగాణ సెంటిమెంట్‌ కంటే అత్యంత ప్రమాదకరమైన సెంటిమెంట్‌ తాజాగా తెలుగు ప్రజల ముందు నిలబడి ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారపార్టీల మధ్య నెలకొన్న అధిపత్య పోరు ఇప్పుడు సెంటిమెంట్‌ రూపంలో తెరపైకి వచ్చింది. ఆంధ్రోడు ఇక్కడకు వచ్చి రాజకీయం చేసి.. అధికారపక్షం ఎమ్మెల్యేనే కొనాలని చూస్తాడా? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే.. హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు.. నా మీదనే తప్పుడు కేసు పెడుతున్నారు.. నేను వ్యక్తిని కాను.. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిని అని కూడా చూడటం లేదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రవిభజనకు ముందు జరిగిన సెంటిమెంటు రాజకీయాలు మొత్తం ఏకపక్షంగా సాగినవే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడాలనే సింగిల్‌ అజెండా సెంటిమెంట్‌తో వ్యవహారం సాగింది. తెలంగాణ రాష్ట్రం వద్దని చెప్పే దమ్ము ఏ రాజకీయ పార్టీకి లేకపోవటం.. టీఆర్‌ఎస్‌ లాంటి పార్టీ.. ఏపీలో లేకపోవటంతో సీమాంధ్రుల హక్కుల కోసం.. వారి బాగోగుల గురించి మాత్రమే మాట్లాడే పార్టీ లేని నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ దూకుడుకు అడ్డు లేకుండా పోయింది.

టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్ని మాటలు అన్నా.. దానికి భిన్నంగా స్పందిస్తే.. ఎక్కడ సెంటిమెంట్‌ దెబ్బ తింటుందోనన్న భయంతో ఎవరూ పెదవి విప్పటానికి సాహసించే వారు కాదు. కానీ.. విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అధిపత్యపోరు పంచాయితీ షురూ అయ్యింది. తెలంగాణ అధికారపక్షానికి తెలంగాణలో అధికారాన్ని నిలుపుకోవటమే ప్రధమ కర్తవ్యం. కానీ.. ఏపీ అధికారపక్షానికి మాత్రం ఇందుకు భిన్నం. ఏపీ ప్రజల్ని మెప్పిస్తూ.. వారి మనసు దోచుకుంటూనే.. తెలంగాణలో పాగా వేయాలన్నది లక్ష్యం.

అందుకు ఆచితూచి అడుగులు వేస్తున్న చంద్రబాబుకు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో సరికొత్త సవాలు ఎదురైంది. తనకు బలం లేకున్నా ఒక ఎమ్మెల్సీని ఏదో రకంగా సొంతం చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. అధికారం చేతిలో ఉన్న కేసీఆర్‌ది కూడా దాదాపు అదే పరిస్థితి. తనకు నలుగురు ఎమ్మెల్సీలను గెలిపించుకోవటానికి మాత్రమే అవకాశం ఉంది. అయినప్పటికీ.. తనకున్న పవర్‌తో ఐదోస్థానాన్ని తన సొంతం చేసుకోవాలని నిర్ణయించారు.

ఇలా ఇద్దరు అధినేతలు తమకు లేని దాని కోసం ఆరాటపడ్డారు. అందులో కేసీఆర్‌ విజేతగా నిలిస్తే.. బాబు ఓడిపోయారు. అంతేకాదు.. ఓటుకు నోటు వ్యవహారంలో సీడీల రూపంలో బయటకు వచ్చి కేసుల చిక్కుల్లో చిక్కుకున్నారు. బాబు చేసిన పనే కేసీఆర్‌ చేసినప్పటికీ.. బాబు బ్యాచ్‌కు  తెలివితేటలు కొరవడటం.. ప్లానింగ్‌ లేకపోవటంతో.. తమ ఎమ్మెల్యేల్ని తీసుకున్నా చేష్టలుడిగి ఉండటం మినహా తెలంగాణ తెలుగుదేశం నేతలు ఏమీ చేయలేకపోయారు. అదే సమయంలో తమ ఎమ్మెల్యేల్ని టచ్‌ చేసే సాహసానికి ఒడిగట్టటంతో వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేయటం.. అందులో రేవంత్‌ రెడ్డి అడ్డంగా దొరికిపోవటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. ఊహించని విధంగా ఏపీ సీఎం మాట్లాడారని చెబుతున్న ఆడియో టేపుల్ని తెలంగాణ రాష్ట్ర అధికారపక్షానికి చెందిన టీవీ ఛానల్‌లో బయటకు రావటంపై చంద్రబాబు అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. ఎప్పుడూ లేని విధంగా సీమాంధ్ర సెంటిమెంట్‌ను బయటకు తీశారు. నేను వ్యక్తిని కాను.. ఏపీ ప్రజల ప్రతినిధిని అంటూ చెప్పుకున్న బాబు.. సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్‌ను హెచ్చరించటమే కాదు.. ఖబడ్డార్‌ అనేందుకు కూడా వెనుకాడలేదు. సాదాసీదాగా మాట్లాడే చంద్రబాబు.. అంతగా చెలరేగిపోతే.. సీమటపాసు మాదిరి పేలే కేసీఆర్‌ మరెంత చెలరేగిపోవాలి? అందుకు ఆయన బాబు మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మొత్తంగా చూస్తే.. తమకు గెలిచే అవకాశం లేని ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడి.. ఆ క్రమంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగత ద్వేషాలతో ఇప్పుడు రెండు ప్రాంతాల ప్రజల్ని ఈ గోదాలోకి లాగుతున్న దృశ్యం. గతంలో మాదిరి తెలంగాణ సెంటిమెంట్‌ మాదిరి ఏకపక్షంగా కాకుండా.. రెండు రాష్ట్రాల్లోనూ సెంటిమెంట్‌ రగిలే వీలుంది. అదే జరిగితే.. ఇద్దరు అధినేతలు సేఫ్‌.. కానీ.. ఆ మంటల్లో ఒళ్లు కాల్చుకునేది మాత్రం రెండు ప్రాంతాల తెలుగు ప్రజలే అన్నది ఖాయం. ఏతావాతా చెప్పేదేమంటే.. చంద్రుళ్లు ఇద్దరూ సుద్ద పూసలు కాదు. అసలుసిసలు రాజకీయ నాయకులు. వారి సెంటిమెంట్‌కు చెలరేగిపోయే కంటే. ఈ వ్యవహారాన్ని వారి మధ్య అధిపత్యపోరుగా చూస్తే మంచిది. కానీ.. అంతటి ఓర్పు.. సహనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో ఉండేందుకు చంద్రుళ్లు ఇద్దరూ ఒప్పుకుంటారా..?

Tags:    

Similar News