చంద్రుళ్ల ‘మెగా’ భేటీకి టీంలు రెఢీ

Update: 2016-09-20 06:44 GMT
మరో రోజులో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకోనుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీళ్ల పంచాయితీకి సంబంధించి ఎవరి వాదనలు వారు వినిపించటం.. ఇరురాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల మీద తమకున్న అభ్యంతరాల్ని వ్యక్తం చేసేందుకు వీలుగా.. కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానుండటం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఏపీ సర్కారు సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో.. అత్యున్నత న్యాయస్థానం స్పందించి.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక భేటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్రమంత్రిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ఎవరికి వారు తమ తమ వాదనల్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారాన్ని చూస్తే.. ఏపీ సర్కారుతో పోలిస్తే.. తెలంగాణ సర్కారే తమ వాదనను వినిపించేందుకు ప్రత్యేక కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. అపెక్స్ భేటీలో తాము అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఒకటికి రెండుసార్లు భేటీ కావటాన్ని మర్చిపోలేం.

ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అంత లోతుగా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టలేదన్న వాదన ఉంది. బుధవారం జరిగే భేటీలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించటంతో పాటు.. ఏపీ చేస్తున్న వాదనల్లో అర్థం లేదని చెప్పటానికి వీలుగా భారీ వాదనను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ వాదనను సమర్థవంతంగా వినిపించేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రత్యేక కసరత్తుతో తన జట్టును సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. సాగునీట అంశాల విషయంలో ఇద్దరు చంద్రుళ్లకు అవగాహన ఉన్నప్పటికీ.. చంద్రబాబుతో పోలిస్తే.. కేసీఆర్ దే పైచేయిగా చెప్పొచ్చు. టెక్నికల్ గా బాబు మాట్లాడతే.. కేసీఆర్ మాత్రం ఎదుటి వారిని ప్రభావితం చేసేలా తన వాదనను వినిపిస్తారన్న మాట వినిపిస్తోంది. ఇక.. ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పోలిస్తే.. ఏపీ మంత్రి దేవినేని ఉమ ఎంత ప్రభావం చూపిస్తారన్నది ఒక ప్రశ్న.

ఇక.. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాలు సిద్ధం చేసిన జట్లు చూస్తే.. ఎవరి బలం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

తెలంగాణ జట్టు చూస్తే..

= ముఖ్యమంత్రి కేసీఆర్

= మంత్రి హరీశ్ రావు

= ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ

= నీటిపారుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోషి

= ఇంజినీర్ ఇన్ చీఫ్ విజయప్రకాశ్

ఏపీ జట్టు చూస్తే..

= ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

= మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

= సీఎస్ ఎన్.పి. ఠక్కర్

= జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్

= ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు
Tags:    

Similar News