కేసీఆర్ తో ట్యూషన్లు చెప్పించుకో బాబు

Update: 2015-07-19 07:33 GMT
దరిద్రం అంటే చంద్రబాబునాయుడిదే. నిజానికి ఆయన్ను అపార తెలివితేటలున్న మొనగాడిగా అభివర్ణిస్తుంటారు. వీరుడు.. శూరుడు అని కూడా కొలుస్తుంటారు. నిజానికి ఆయనకు అంత సీన్ ఉన్నట్లు కనిపించదు. గోదావరి పుష్కరాల సందర్భంగా.. ప్రచారం చేసిన బాబు చేసిన ఓవర్ యాక్షన్ అందరి చేత తలంటు ఆడించుకునే పరిస్థితి.

తనలాంటి సమర్థత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో.. గోదావరి పుష్కరాల్ని భారీగా నిర్వహించటంతో పాటు..బోలెడంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం ఖాయమన్న ఆత్మవిశ్వాసంలో బాబు ఉన్నట్లు చెబుతారు. అందుకే ఆయన ఒక విదేశీ ఛానల్ ప్రతినిధుల్ని ప్రత్యేకంగా రప్పించి.. షూటింగ్ లో పాల్గొనటం.. అది పూర్తయి.. బాబు అక్కడి నుంచి వెళ్లిన పోయిన తర్వత తీవ్ర స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకోవటం.. 27మంది మరణించటం  జరిగింది.

తన తప్పుల్ని సూటిగా ఒప్పుకోని తత్వం కలిగిన చంద్రబాబు.. తొక్కిసలాటపై క్షమాపణలు కోరటం కనిపిస్తుంది. బాబు సారీ చెప్పిన తర్వాత కూడా.. పుష్కరాల పనుల్ని నిర్వహించటంలో చేతకాలేదన్న విమర్శ వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఇలాంటి రాజకీయ విమర్శలకు.. ఆరోపణలకు బలంగా సమాధానాలు చెప్ప లేని చంద్రబాబు..చేతల్లో పని మొదలుపెట్టారు.

తొక్కిసలాట సందర్భంగా జరిగిన డ్యామేజ్ ను తగ్గించే ప్రయత్నంలో ఆయన పలువురి ఆకర్షించే పనిలో పడ్డారు. అర్థరాత్రి వేళ.. పుష్కర ఘాట్లలో సందర్శన.. బస్లాండ్లు.. ఇతర ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇన్ని చేస్తున్నా... బాబు కారణంగా 27 మంది చనిపోయారన్న విమర్శే తీవ్రంగా వినిపిస్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని చూద్దాం.

ఏపీలో మాదిరే తెలంగాణలోనూ పుష్కరాలు నిర్వహిస్తున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రేమీ అర్థరాత్రిళ్లు బజార్ల వెంట తిరగటం లేదు. పుష్కర ఘాట్లకు వెళ్లి.. భక్తులతో మాట్లాడటం లేదు. ధైర్య వచనాలు పలకటం లేదు. ఏపీలో మాదిరి తొక్కిసలాట ఘటన మినహా.. మిగిలిన ఏర్పాట్లకు సంబంధించి చాలానే వైఫల్యాలు.. అధికారుల నిర్లక్ష్యం.. సరైన అంచనాలు లేకపోవటం కనిపిస్తుంది. అయినప్పటికీ.. కేసీఆర్ మీద ఒకటంటే..ఒక్క బలమైన విమర్శ చేస్తున్న వాళ్లు లేరు.

శనివారం ఇష్యూనే తీసుకుంటే.. జనం భారీగా రావటంతో ఏపీలో మాదిరే.. తెలంగాణలోనూ భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. ప్రయాణీకులు పడిన నరకం అంతాఇంతా కాదు. కానీ.. చంద్రబాబు మాదిరి అర్థరాత్రి వేళ బస్టాండ్ కు వెళ్లి మూడు గంటల పాటు పరిస్థితిని ఏమీ కేసీఆర్ అధ్యయనం చేయలేదు. అదొక్కటే కాదు.. బాబు మాదిరి పుష్కర ఘాట్లను సందర్శించటం.. భక్తుల కష్టనష్టాల గురించి ఆరా తీయటం లాంటివి చేయలేదు. శనివారం సంగతే చూసుకుంటే.. ప్రత్యూష ను పలుకరించటం.. డిప్యూటీ ముఖ్యమంత్రి అలీ ఇంటికి వెళ్లి రంజాన్ విందుకు హాజరు కావటం లాంటివి చేశారు. అదే సమయంలో టోల్ గేట్ల దగ్గర డబ్బులు వసూలు చేయొద్దన్న ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్లో కూర్చొని.. లక్షలాది మంది వస్తున్న పుష్కర భక్తులకు సంబంధించిన అంశాల మీద కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటూ.. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కాలు కాలిన పిల్లిలా అటూఇటూ తిరగటం ఏమిటి? ఇంత చేస్తున్నా బాబుకు విమర్శలు తప్పటం లేదు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి మీద విమర్శలు అన్నవి వినిపించని పరిస్థితి. తిట్టించుకోకుండా.. విమర్శల పాలు కాకుండా పని చేయటం ఎలా అన్న అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఏపీ సీఎం చంద్రబాబు ట్యూషన్ చెప్పించుకుంటే మంచిదేమో.
Tags:    

Similar News