కేసీఆర్.. జగన్ లు ఇద్దరు అంత పెద్ద తప్పు చేశారా?

Update: 2020-10-07 05:15 GMT
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సాగిన జలవివాదాల పంచాయితీలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయకూడని తప్పు చేశారా? కూర్చొని మాట్లాడుకొని పేచీల్ని ఒక కొలిక్కి తీసుకురావాల్సిన వారు.. అందుకు భిన్నంగా కేంద్రం చేతికి జుట్టు ఇచ్చేందుకు ఓకే అంటున్నారా? ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూర్చోబెట్టి.. మీ పంచాయితీ మేం తేలుస్తాం కదా.. అనేలా కేంద్రానికి ఇవ్వకూడని అవకాశాన్ని ఇచ్చారా? అంటే.. అవుననే మాటలు వినిపిస్తున్నాయి.

భేషజాలకు పోకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ.. నీళ్లను పంచుకుందామన్న మైండ్ సెట్ ఉండాల్సిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అందుకు భిన్నంగా ఒకరి ప్రాజెక్టుపై మరొకరు తప్పులు ఎత్తి చూపించుకుంటూ చేయకూడని తప్పును చేస్తున్నట్లుగా చెప్పాలి.

పిట్టపోరు.. పిట్టపోరు పిల్లి తీరిస్తే ఎలా ఉంటుందో తెలిసిందే.. సరిగ్గా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు పుణ్యమా అని.. సీన్లోకి వచ్చిన కేంద్రం పెద్దన్న పాత్ర పోషించేందుకు నడుం బిగించటం గమనార్హం. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు.. నీటి లెక్కల గురించి ఇద్దరు ముఖ్యమంత్రులకు అవగాహన ఎక్కువే. అలాంటప్పుడు కూర్చొని కొలిక్కి తెచ్చుకోవాల్సిన విషయాన్ని కేంద్రం కోర్టులోకి తీసుకెళ్లటం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది.

తాజాగా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు భిన్నమైన వాదనను వినిపించిన వేళ.. కలుగజేసుకున్న కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్..ఇరు రాష్ట్రాలు.. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్ లను సమర్పించాలని.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వాటిని ఆపి వేయాలని స్పష్టం చేయటం గమనార్హం. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రాజెక్టులకు సంబంధించిన తాళం చెవిని కేంద్రం తీసుకున్నట్లు అవుతుంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ తినే అవకాశం ఉంది.

విషయాల మీద అవగాహన ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరు.. కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకునే దానికి.. కేంద్రం జోక్యం చేసుకునే వరకు వెళ్లటం రెండు రాష్ట్రాలకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. గతంలో ఎప్పుడూ ఏ రాష్ట్రం విషయంలోనూ కేంద్రం ఇలాంటి తీరును ప్రదర్శించలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి పలు ఉదాహరణల్ని ప్రస్తావిస్తున్నారు.

దేశంలోని ఏ రాష్ట్రమైనా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసినప్పుడు అందుకు భిన్నమైన వాదనను మరో రాష్ట్రం వినిపించటం కామన్. అలాంటప్పుడు ఆ వివాదాల్ని సదరు రెండు రాష్ట్రాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తాయి. అందుకు భిన్నంగా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయని.. దీనికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరేనన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News