వరాల దేవుడికి పీనాసితనమా?

Update: 2016-09-01 06:05 GMT
ఒక్కొక్కరికి ఒక్కో ఇమేజ్ ఉంటుంది.అందుకు తగ్గట్లే వ్యవహరించాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న వెంటనే ఆయన మాటలు.. హావభావాలు.. ఆయన ఉద్యమ స్ఫూర్తితో పాటు ముఖ్యమంత్రిగా ఆయనిచ్చే వరాలు ఇట్టే గుర్తుకు వచ్చాయి. అడిగినంతనే వరం ఇచ్చేయటంతో పాటు.. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు భారీ పరిహారాన్ని ప్రకటించటంలో ఆయన తర్వాతే ఎవరైనా.

సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లేలా చేసింది నందమూరి తారక రామారావు అయితే.. సంక్షేమ కార్యక్రమాల్లో భారీతనం కొట్టొచ్చినట్లు కనిపించేలా చేయటం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే చెల్లింది. వృదాప్య పింఛన్ ను గౌరవనీయ మొత్తంలోకి మార్చిన క్రెడిట్ ఆయనకే చెల్లుతుంది. అంతేనా.. ఆరోగ్య శ్రీ పేరిట..పేద వారికి ఖరీదైన వైద్యం అందేలా చేయటంలో ఆయన తర్వాతే. నిజానికి ఈ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నఆరోపణలు ఉన్నా.. ఈ పథకం ద్వారా లబ్థి పొందిన సామాన్య ప్రజలు భారీగానే ఉన్నారు. నిజానికి ఈ పథకమే వైఎస్ ను అందరికీ దగ్గరకు చేర్చటమే కాదు.. ఆయన్నో గొప్ప నేతన్న ఇమేజ్ ను వచ్చేలా చేసింది.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారానికి వస్తే.. ఆయనది కాస్త భిన్నమైన ధోరణి. పోటీకి వస్తే అవతలి వారి కంటే ఎక్కువన్న కాన్సెప్ట్ లోనే ఉంటారు. అందుకోసం ఎంతకైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ కారణంతోనే ఏదైనా దుర్ఘటన జరిగిన సమయంలో పరిహారం ఇవ్వాల్సి వస్తే అరకొరగా సాయం ప్రకటించే వారు. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించేవారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు రూ.5లక్షలు.. రూ.10 లక్షలు.. కొన్ని సందర్భాల్లో రూ.20 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించేవారు.

కేసీఆర్ పెద్ద ఎత్తున పరిహార ప్రకటన చేసిన నేపథ్యంలో.. అదే రీతిలో తాము కూడా చేయాలన్న పట్టుదలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకూడా తానిచ్చే పరిహారం మొత్తాన్ని విపరీతంగా పెంచేశారు. ఇదిలా ఉంటే.. నిన్న (బుధవారం) కురిసిన భారీ వర్షం నేపథ్యంలో గోడ కూలిన ఘటన.. పాత భవనం కూలిన ఉదంతంలో మొత్తం ఏడుగురు మరణించారు. పెద్ద పెద్ద విపత్తుల్లోనే మృతుల సంఖ్య కనిష్ఠంగా ఉంటే.. భారీ వర్షానికి ఇంతమంది మృత్యువాత పడటం ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎప్పుడూ లేనట్లుగా మృతులకు తెలంగాణ సీఎం ప్రకటించిన పరిహారం షాకింగ్ గా మారింది. వరాల దేవుడిగా వ్యవహరించే ఆయన.. వర్షం కారణంగా కూలిన గోడలతో మృతి చెందిన కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం అందించిన తీరు కొత్తగా ఉందని చెప్పాలి. గతంలో లేనట్లుగా ఆచితూచి పరిహార ప్రకటన కేసీఆర్ నోటి వెంట ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
Tags:    

Similar News