తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవలి కాలంలో టెక్నాలజీలో దూకుడును ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. `ఆయనకేం తెలుసు టెక్నాలజీ గురించి? గూగుల్ గురించి కాస్తైనా పరిచయం ఉందా?` అనే సెటైర్ల దశ నుంచి `కేసీఆర్ పెద్ద టెక్ సీఎం` అనే ప్రశంసను గులాబీ దళపతి పొందారు. అసెంబ్లీ సాక్షిగా నీటి పారుదల ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి గూగుల్ ఎర్త్ ద్వారా సవివరంగా తెలియజెప్పి కేసీఆర్ ఈ గుర్తుంపు పొందారు. అలాంటి కేసీఆర్ టెక్నాలజీ ద్వారా సామాన్యుల కోసం మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అదే రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి చెక్ పెట్టడం.
సామాన్యులకు తరచుగా అవసరం పడే స్థిరాస్థుల -దస్తావేజుల రిజిస్ట్రేషన్లు - డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఇబ్బందులు తప్పనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలకు పరిష్కారం చూపించేందుకు స్టాంపులు - రిజిస్ట్రేన్లశాఖకు ప్రత్యేకంగా వాట్సప్ మొబైల్ నెంబర్ 7093920206ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలు ఈ వాట్సప్ నెంబర్ కు మీ సమస్యను పంపిస్తే తక్షణమే అధికారులు స్పందించి పరిష్కారాని చూపిస్తారు. భూమి రిజిస్ట్రేషన్ లు కావడం లేదని, కొంత ముట్టజెపితే చేస్తున్నారని, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొందరు దళారులు ఈ దందా చేస్తున్నట్టు ఇటీవల ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. సందేహాలు - అనుమానాలు - ఫిర్యాదులను వాట్సప్ నంబర్‌కు పంపితే - సంబంధిత జిల్లాల డీఐజీలు - రిజిస్ట్రార్లకు చేరవేస్తామని జాయింట్ కమిషనర్ చెప్పారు.