'ఎగ్జిబిష‌న్‌'కు దిమ్మ తిరిగేలా కేసీఆర్ షాక్

Update: 2017-08-30 05:48 GMT
జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రించ‌టం.. ఆపై మాట విన‌కుంటే కాస్తంత మౌనంగా ఉండ‌టం.. టైం చూసి.. లెక్క చెక్ చేసుకొని మ‌రీ షాకివ్వ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తాజాకు అల‌వాటే. తాజాగా అలాంటి షాకే ఇచ్చారాయ‌న‌. హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీ భూముల లీజుపై కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. గ‌త ప్ర‌భుత్వాల‌కు భిన్నంగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఎంత‌టి వారైనా స‌రే.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకునేది లేద‌ని.. షాక్ ట్రీట్ మెంట్ త‌ప్ప‌ద‌న్న సందేశాన్ని కేసీఆర్ తాజాగా మ‌రోసారి ఇచ్చార‌ని చెప్పాలి. అప్పుడెప్పుడో నిజాం కాలం(1938)లో షురూ అయిన ఇండ‌స్ట్రియ‌ల్ ఎగ్జిబిష‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ నిర్వ‌హిస్తున్నారు. 1938లో నాటి హైద‌రాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ న‌వాబ్ మెహ‌దీన‌వాజ్ జంగ్ బ‌హ‌దూర్ ఆధ్వ‌ర్యంలో ఎగ్జిబిష‌న్ నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌త్యేక సొసైటీని ఏర్పాటు చేశారు. 1946లో అప్ప‌టి హైద‌రాబాద్ ప్ర‌ధాని మీర్జా ఇస్మాయిల్ ఎగ్జిబిష‌న్ సొసైటీకి నాంప‌ల్లిలో 24.67 ఎక‌రాల భూమిని ఇచ్చారు.

అనంత‌రం నిజాం పాల‌న ముగిసి భార‌త్ లో నిజాం సంస్థానం విలీనం అయ్యాక‌.. ఏపీలో హైద‌రాబాద్ రాష్ట్రం క‌లిసిన త‌ర్వాత ఎగ్జిబిష‌న్ సొసైటీగా రిజిస్ట్రేష‌న్ చేయించారు. అప్ప‌టి నుంచి ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రిలో అఖిల భార‌త పారిశ్రామిక ప్ర‌ద‌ర్శ‌న పేరిట భారీ ఎగ్జిబిష‌న్‌ ను నిర్వ‌హిస్తున్నారు. నిజాం కాలంలో ఇచ్చిన లీజు ముగిసిన నేప‌థ్యంలో 2006లో మ‌రో 50 ఏళ్ల పాటు లీజును పొడిగిస్తూ నాటి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీనిపై వివాదం త‌లెత్త‌టంతో గ‌డువును 2002 ఏప్రిల్ నుంచి 2052 వ‌ర‌కు పొడిగిస్తూ స‌వ‌ర‌ణ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. ఎగ్జిబిష‌న్ సొసైటీకి రాష్ట్ర హోంమంత్రులు ఛైర్మ‌న్లుగా ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఆర్థిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్ ను క‌మిటీ ఛైర్మ‌న్‌ గా ఎన్నుకున్నారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఈ ఎగ్జిబిష‌న్ భూముల మీద సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భూమిని శ్వాశ్వితంగా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. కానీ.. అధికారులు అందుకు నో చెప్పారు. ఈ కారణంతోనే 2016లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎగ్జిబిష‌న్ ను ప్రారంభించినా లీజు విష‌యంపై నోరు విప్ప‌లేదు. ఇదిలా ఉంటే.. ఊహించ‌ని రీతిలో ఈ ఎగ్జిబిష‌న్ భూముల్ని తాజాగా తెలంగాణ‌రాష్ట్ర రోడ్డు.. భ‌వ‌నాల శాఖ‌కు అప్ప‌గిస్తూ కేసీఆర్ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది.

ఎందుకిలా జ‌రిగిందంటే. . ఎగ్జిబిష‌న్ స్థ‌లాన్ని సొసైటీ నిర్వ‌హాకులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. స్థ‌లాన్ని దుర్వినియోగం చేసేలా చేయ‌ట‌మే కార‌ణంగా చెబుత‌న్నారు. ఇటీవ‌ల పాల‌క వ‌ర్గం రూ.2కోట్ల‌తో క్ల‌బ్ నిర్మించ‌టం వివాదంగా మారింది. వాస్త‌వానికి క్ల‌బ్ ఆలోచ‌న‌ను మంత్రి ఈటెల వ్య‌తిరేకించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మాట విన‌కుండా క్ల‌బ్‌ను నిర్మించ‌టం గ‌మ‌నార్హం. ఇదొక్క అంశ‌మే కాదు.. సొసైటీ నిర్వ‌హ‌ణ‌.. ఆస్తులు.. ఆదాయం..ఇతర అంశాల‌పై వెల్లువెత్తుతున్న ఆరోప‌ణ‌లు ముఖ్య‌మంత్రి దృష్టికి వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ముఖ్య‌మంత్రి..ఈ ఇష్యూకు ఊహించ‌ని నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.

ఇదే స‌మ‌యంలో.. ఈ వివాదానికి శాశ్విత ప‌రిష్కారంగా తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ఇక్క‌డ చేప‌డితే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌ను ముఖ్య‌మంత్రి చెవిన వేయ‌టంతో ఆయ‌నకు ఆ స‌ల‌హా న‌చ్చింద‌ని చెబుతున్నారు. ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేసే ప‌నిలో భాగంగా తాజాగా ఎగ్జిబిష‌న్ భూమిని రోడ్డు.. భ‌వ‌నాల శాఖ‌కు అప్ప‌గించేలా ప్ర‌భుత్వం ఆదేశాలుజారీ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. తాజా నిర్ణ‌యంతో భ‌విష్య‌త్తులో ఎగ్జిబిష‌న్ నునిర్వ‌హించే విష‌యం మీద నీలినీడ‌లు క‌మ్ముకున్న‌ట్లే. ఎగ్జిబిష‌న్ న‌ను నిర్వహించే రోజుల్లో 2500 స్టాళ్ల ఏర్పాటుతో పాటు.. రోజుకు ల‌క్ష మందికి పైగా వ‌చ్చే ఎగ్జిబిష‌న్ రానున్న రోజుల్లో ఏం కానుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అధికార‌ప‌క్ష నేత‌లు చెబుతున్న‌ట్లుగా డ‌బుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎగ్జిబిష‌న్ భూముల్ని వినియోగిస్తే.. అదో సంచ‌ల‌నంగా మార‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News