ఆంధ్రాలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న కేసీఆర్ కామెంట్స్‌

Update: 2017-07-30 00:30 GMT
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని జిల్లా స్థాయి రాజ‌కీయాల‌కు సంబంధం ఏంటి? అందులోనూ ప్ర‌కాశం జిల్లా తెలంగాణ‌లోని ఏ జిల్లాతో కూడా ఆనుకొని లేదు క‌దా! అలాంపుడు ప్ర‌కాశం పాలిటిక్స్‌ ను ప్ర‌త్యేక రాష్ట్రం గ‌ళం వినిపించిన నాయ‌కుడు ఎలా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రు? అని అనుకుంటున్నారా?  మీ సందేహం నిజ‌మే! అయితే దానికి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల నుంచే వినిపిస్తోంది.

జంప్ జిలానీల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల‌ను - నేత‌లను తెలుగుదేశం పార్టీలోకి లాక్కున్న చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా వారికి ర‌క‌ర‌కాల హామీలు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లు పెంపు ఖాయమని పేర్కొంటూ వైసీపీకి చెందిన శాసనసభ్యులను పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ఇన్‌చార్జులకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామన్న హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన తెలుగుతమ్ముళ్ళు తమకు కూడా టిక్కెట్లు కూడా వస్తాయన్న ధీమాలో ఉన్నారు. ప్రధానంగా జిల్లాలోని చీరాల - అద్దంకి - గిద్దలూరు - కందుకూరు నియోజకవర్గాల్లోని తెలుగుతమ్ముళ్లు ఈ భ‌రోసాలో ఎక్కువ‌గా ఉన్నారు. అయితే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో స‌మావేశం అనంత‌రం తెలంగాణ సీఎం కేసీఆర్ సీట్ల పెరుగుదల చాన్సే లేద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌కాశం జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు అంతర్మథనంలో పడ్డారు. ఇప్పటివరకు తమకే ఎదో ఒక నియోజకవర్గంలో టికెట్ దక్కుతుందన్న నేతల ఆశలకు కేంద్రం గండికొట్టిందని అయోమయంలో ఉన్నట్లు సమాచారం.

ప్రధానంగా అద్దంకి నియోజకవర్గంలో రోజురోజుకు శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ - ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి వర్గీయుల మధ్య యుద్దమే జరుగుతుంది. ఇటీవల జరిగిన తాజా పరిస్థితుల నేపధ్యంలో అద్దంకి నియోజకవర్గంలో పవర్ అంతా శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్‌ కేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంగా ప్రకటించారు.దీంతో కరణం వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. 2019 ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటన్న మీమాంసలో కరణం బలరాంతోపాటు ఆయన కుమారుడు కరణం వెంకటేష్ ఉన్నారు. కాగా గతంలోను గొట్టిపాటి రవికుమార్‌ కే అద్దంకి పగ్గాలు అని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించినప్పటికీ  గొట్టిపాటి, కరణం వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల  పెంపు లేక‌పోతే ప‌రిస్థితి ఏమిట‌నే చ‌ర్చ తెలుగుదేశం వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. మొత్తంగా రానున్న రోజుల్లో అద్దంకి రాజకీయాలు శరవేగంగా మారే అవకాశాలున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం.

అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌ రెడ్డి - ఇన్‌ చార్జి అన్నా రాంబాబుల వర్గీయుల మధ్యకూడా పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అద్దంకిలో గొట్టిపాటికే పగ్గాలు ముఖ్యమంత్రి ప్రకటించిన తరువాత ఆ విధానమే జిల్లాలోని గిద్దలూరు - చీరాల - కందుకూరు నియోజకవర్గాలకు వర్తించనుంది. ఈనేపధ్యంలో అన్నా రాంబాబు రాజకీయ వ్యూహం ఏమిటన్న చర్చ సాగుతుంది. అన్నా రాంబాబు కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దవౌతున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అన్నాకు ఏదో ఒక నియోజకవర్గాన్ని కేటాయించేందుకు వీలు ఉండేది. కానీ విభజనకు చాన్స్‌ లేకపోవటంతో అన్నాతోపాటు ఆయన అనుచరులు ఆందోళనలో ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ చాప‌కింద నీరులా బ‌ల‌ప‌డుతోంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం వైసీపీ వైపు చూస్తున్నాయ‌ని చెప్తున్నారు.

ఇదిలా ఉండగా చీరాలలో రాజకీయం వేడెక్కుతునే ఉంది. శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ - ఎమ్మెల్సీ పోతుల సునీతల వర్గీయుల మధ్య యుద్దమే జరుగుతుంది. సునీతకు తోడు మాజీ మంత్రి పాలేటి రామారావు సైతం వేరొకవర్గాన్ని చేసుకుని రాజకీయంగా పావులు కదుపుతున్నారు. దీంతో చీరాలలో మూడుగ్రూపులుగా రాజకీయాలు విరాజిల్లుతున్నాయి. ఈలాంటి పరిస్దితిల్లో రానున్న ఎన్నికల్లో ఈ ముగ్గురిలో ఏవరికి దక్కుతుందన్న అంతర్మధనంలో తెలుగుతమ్ముళ్ళు ఉన్నారు. కందుకూరులో శాసనసభ్యుడు పోతుల రామారావు - ఇన్‌ చార్జీ దివి శివరాంల వర్గీయుల మధ్య పొంతన లేకుండా పోయింది. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాల్లోని కొంతమంది తెలుగుతమ్ముళ్ళు ఆపార్టీలోనే ఉంటారా లేక ప్రత్యామ్నాయ మార్గాలవైపు పరుగులు పెడ్తారా అన్న విషయం రాజకీయంగా జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొత్తంగా తెలంగాణ కేసీఆర్ ప్రకటనలతో ఏపీలోని కీల‌క‌ జిల్లాలో, కుమ్ములాట‌ల‌కు వేదిక‌గా మారిన చోట క‌ల‌క‌లం రేకెత్తిస్తోంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News