బాబును క‌డిగి పారేసిన కేసీఆర్‌

Update: 2018-10-16 18:53 GMT
తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోటి మాట‌కు ప‌దునెక్కువ‌. ఆయ‌న మాట‌లు చుర‌క‌త్తుల్లా ఉంటాయి. అలాంటి కేసీఆర్ కు కోపం వ‌స్తే.. అందునా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద అయితే.. ఇక చెప్పేదేముంది? ఎప్ప‌టిలానే తాజాగా మ‌రోసారి బాబుపై చెల‌రేగిపోయారు కేసీఆర్‌.

ముంద‌స్తు ఎన్నిక‌ల న‌ల్లేరు మీద న‌డ‌క‌లా సాగుతుంద‌న్న స్థానంలో మ‌హా కూట‌మితో కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిన బాబుపై పీక‌ల్లోతు ఆగ్ర‌హంతో ఉన్న కేసీఆర్‌.. ఆయ‌న‌పై తాజాగా విరుచుకుడ్డారు. తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రోళ్ల‌కు చంద్ర‌బాబు శ‌నిలాంటోడ‌ని ఫైర్ అయ్యారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బాబుకు బుద్ధి చెప్పార‌ని. మ‌ళ్లీ ఇప్పుడు మ‌రోసారి బాబుకు డిపాజిట్ కూడా ద‌క్క‌కుండా బుద్ధి చెబుతార‌న్న జోస్యం చెప్పారు.

ఇప్ప‌టికే ఓటుకు నోటు కేసులో బాబు ఇరుక్కున్నార‌న్న ఆయ‌న‌.. సిగ్గు లేకుండా మ‌ళ్లీ వ‌స్తున్నారంటూ తీవ్రంగా మండిప‌డ్డారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఆంధ్రోళ్లు టీడీపీకి ఓట్లు వేయ‌లేద‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబుకు కేసీఆర్ గుర్తు చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబు రూ.100 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు చెప్పారు. అయినా ఒక్క‌రుకూడా ఓటేయ‌లేద‌న్న ఆయ‌న‌.. రానున్న ఎన్నిక‌ల్లో బాబుకు మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతుంద‌న్నారు.

ఆంధ్రోళ్లు ప్ర‌స్తుతం మంచిగా ఉంటే.. మ‌ళ్లీ చంద్ర‌బాబు చెడ‌గొడుతున్నాడ‌న్న ఆయ‌న గ్రేట‌ర్ లో 12 మంది ఆంధ్రా కార్పొరేట‌ర్లు ఉన్నార‌ని చెప్పారు. ఏడు మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన‌ట్లు చెప్పారు. ఏపీలో ప‌వ‌ర్లో ఉన్న చంద్ర‌బాబు త‌న ఎన్నిక‌ల హామీల్లో ఏ ఒక్క‌దాన్ని తీర్చ‌లేద‌న్నారు. ఒక‌ప్పుడు బాబు పాల‌న‌లో హైద‌రాబాద్‌లో పొద్దున లేచింది మొద‌లు క‌ర్ఫ్యూ.. ఘ‌ర్ష‌ణ‌లు ఉండేవ‌న్నారు. కానీ.. గ‌డిచిన నాలుగేళ్ల‌లో క‌బ్జాలు.. గూండాయిజం ఎక్క‌డైనా క‌నిపించాయా? అని ప్ర‌శ్నించారు.

త‌మ పాల‌న‌లో బాబు పెట్టిన దుర్మార్గాల‌న్నీ అంత‌రించిపోతున్నాయ‌న్న కేసీఆర్‌.. తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రోళ్లంతా తెలంగాణ బిడ్డ‌లేన‌న్నారు. అస‌లు తెలంగాణ స‌మాజంలో సెటిల‌ర్స్ అన్న ప‌ద‌మే లేద‌న్నారు. ఆంధ్రోళ్లంతా తెలంగాణ బిడ్డ‌ల‌తో క‌లిసిపోయార‌న్నారు. డిసెంబ‌రులో ఏం జ‌రుగుతందో చూడాల‌న్న కేసీఆర్‌.. తాను భ‌య‌ప‌డితే ముంద‌స్తుకు ఎందుకు వెళ‌తాన‌ని చెప్పారు. ఎన్నిక‌ల్లో గెలుపు మీద ఇంత ధీమా ఉంటే.. ఎన్నిల‌క హామీల పేరుతో భారీగా వ‌రాల మూట విప్పుడెందుకు కేసీఆర్ మ‌హ‌రాజ్..?
Tags:    

Similar News