నదుల అనుసంధానం..కేసీఆర్ హాట్ కామెంట్

Update: 2019-08-29 14:17 GMT
ఇటీవల ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు గోదావరి -కృష్ణా నదుల అనుసంధానం ద్వారా తెలంగాణకే లాభమని.. సీఎం జగన్ దీన్ని విరమించుకోవాలని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ భూభాగం గుండా వెళ్లే ఈ ప్రాజెక్ట్ వల్ల తేడాలు వస్తే తెలంగాణకే లాభమని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కేసీఆర్ మండిపడ్డారు. గురువారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిశీలనకు వెళ్లిన కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మాటలను తప్పుపట్టారు.

గోదావరి-కృష్ణా నదులను అనుసంధానించి శ్రీశైలాన్ని గోదావరి జలాలతో నింపాలని ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించారని.. దీనివల్ల నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సాగు, తాగునీటితోపాటు రాయలసీమకు నీళ్లు వస్తాయన్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రతిపాదనను చంద్రబాబు రాజకీయం కోసం వాడుకుంటూ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు వంటి అసమర్థ నేతల వల్లే తెలంగాణ, ఏపీకి నష్టం జరిగిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. 2003లోనే తాను గోదావరితో శ్రీశైలం నింపాలని ప్రతిపాదిస్తే బాబు మోకాలడ్డాడు అని కేసీఆర్ మండిపడ్డారు.

ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ రూపు రేఖలు మార్చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సంవత్సరంలోగా పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కొందరు కేసులు వేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యిందని కేసీఆర్ వివరించారు.  ఈ పథకాన్ని 4 వేల కోట్లతో పూర్తి చేసి ప్రాజెక్ట్ కేనాల్స్ ద్వారా చెరువులన్నీ నింపి రైతులకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చారు.
    
    
    

Tags:    

Similar News