దిశ ఎన్‌ కౌంట‌ర్‌..కేసీఆర్ మ‌ళ్లీ ఏం అన్నారంటే

Update: 2020-01-02 14:03 GMT
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ ఎన్‌ కౌంట‌ర్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మ‌రోమారు స్పందించారు. ప్ర‌త్య‌క్షంగా కాకుండా... ప‌రోక్షంగా ఆ ఉదంతం గురించి రియాక్ట‌య్యారు. అదే స‌మ‌యంలో పోలీసుల గురించి సైతం ప్రశంస‌లు కురిపించారు. `జర్నీ థ్రూ టర్బులెంట్‌ టైమ్స్‌` పేరుతో మాజీ డీజీపీ హెచ్‌ జె దొర ఆటోబయోగ్రఫీ రాశారు. ఈ  పుస్తకాన్ని ప్రగతి భవన్‌ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు.

దురదృష్టవశాత్తూ సమాజంలో నేరప్రవృత్తి పెరుగుతోందని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. కొన్ని చోట్ల మనషులు మృగాల్లా మారుతున్నారని పేర్కొన్నారు. నేరప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. మంచిని కాపాడడం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పు కాదు అని సీఎం అన్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుందన్నారు. సమాజానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప‌రోక్షంగా దిశ నిందితుల‌ ఎన్‌ కౌంట‌ర్ - దానిపై వ‌చ్చిన స్పంద‌న‌ల గురించి ప్ర‌స్తావించార‌ని అంటున్నారు.

తెలంగాణ పోలీసులు సామాజిక రుగ్మతలు తొలగించేందుకు కృషి చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణకే పరిమితం కాకుండా పోలీసులు సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. గుడుంబా నిర్మూలన - పేకాట క్లబ్బుల మూసివేత - బియ్యం అక్రమ రవాణా అరికట్టడం - హరిత హారం ద్వారా చెట్లను పెంచడంలో పోలీసులు ఎంతో కృషి చేశారు అని సీఎం కొనియాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా పోలీసులు తమ వంతు పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయడం ద్వారానే నైతిక విలువలు పెంపొందించొచ్చు అని చెప్పారు. విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచే బోధించాలని భావిస్తున్నామని సీఎం తెలిపారు. విలువలు పెంపొందించేలా పాఠ్యాంశాల తయారీ కోసం మాజీ డీజీపీలతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జీయర్‌ స్వామి లాంటి ఆధ్యాత్మిక - ధార్మికవేత్తల సలహాలు తీసుకుంటామన్నారు. 


Tags:    

Similar News